రేపటి(మంగళవారం) నుంచి ఇంటినుండి బయటకు వచ్చేముందు ప్రతిఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. రేపటి(మంగళవారం) నుంచి ఇంటినుండి బయటకు వచ్చేముందు ప్రతిఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మాస్కులు ధరించకుండా బయటకు వస్తే గ్రామాల్లో అయితే రూ.500, పట్టణాలలో అయితే రూ.1000 జరిమానా విధించనున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులకు జరిమానా పుస్తకాలు అందాయి.

ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 368 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,93,734కి చేరుకుంది.

కోవిడ్ కారణంగా నిన్న ఏ ఒక్కరూ చనిపోలేదు. రాష్ట్రంలో వైరస్ బారినపడి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,189కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,188 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 263 మంది కోలుకున్నారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,84,357కి చేరుకుంది. నిన్న 31,138 మందికి కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 1,47,36,326కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 40, చిత్తూరు 40, తూర్పుగోదావరి 20. గుంటూరు 79, కడప 10, కృష్ణా 37, కర్నూలు 49, నెల్లూరు 20, ప్రకాశం 6, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 39, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలలో 9 కేసులు చొప్పున నమోదయ్యాయి.