Asianet News TeluguAsianet News Telugu

బాబుపై రోజా వ్యాఖ్యల చిచ్చు: బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు, లోకేష్ పై వైసిపి సంచలనం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయి.

Controversy over Roja's comments on Chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయి. రోజాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుద్ధా వెంకన్నను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి టీజెఆర్ సుధాకర్ బాబు హెచ్చరిక చేశారు. 

కరువుకు షర్ట్ వేస్తే  చంద్రబాబులా ఉంటుందని రోజా వ్యాఖ్యానించారు. దీనిపై బుద్ధా వెంకన్న తీవ్రంగా ప్రతిస్పందించారు. రోజా ఒక శని అని అన్నారు. శనికి చీరాజాకెట్ కడితే అది రోజా అని వ్యాఖ్యానించారు. రోజా టీడీపిలో ఉన్నంత కాలం తమకు శని పట్టిందని అన్నారు. 

రోజా వైఎస్ ను కలిసిన వెంటనే ఆయన చనిపోయారని, జగన్ జైలుకు వెళ్లారని బుద్ధా వెంకన్న అన్నారు. రోజా ఐరన్ లెగ్ అనే విషయం రాష్ట్రానికంతటికీ తెలుసునని అన్నారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. 

జగన్ రాసిన స్క్రిప్టును రోజా చదువుతున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. రోజాకు రాజకీయ ఓనమాలు కూడా తెలియవని అన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ ఫిరాయించే మంత్రి పదవి తీసుకున్నారని, ఫిరాయింపులు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ అని ఆయన అన్నారు. 

మంత్రి పీతల సుజాత సైతం రోజా వ్యాఖ్యలను తప్పు పట్టారు. వైసిపి నేతలకు మనుషులను చంపే గన్ లు తప్ప నీరందించే రెయిన్ గన్ ల గురించి తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. రెయిన్ గన్స్ ద్వారా నీరందించి ప్రతి రైతు కళ్లలో చంద్రబాబు ఆనందం చూశారని అన్నారు. విహారయాత్రకు చంద్రబాబు ఒక్కరే వెళ్లలేదని, జగన్ కూడా పలు మార్లు వెళ్లారని సుజాత అన్నారు. 

బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై టీడీపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన అన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిలదీసిన రోజాపై బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మండిపడ్డారు. 

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపితే తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా అని ప్రశ్నించారు. అదే జరిగితే చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ తామూ కోడిగుడ్లతో దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. 

బుద్ధా వెంకన్న సభ్యతాసంస్కారాలు మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా రోజా చేసిన పోరాటంతో చంద్రబాబు కూడా ఆ బాలికను పరామర్శించాల్సి వచ్చిందని అన్నారు. 

ప్రభుత్వాన్ని నిలదీసిందని చెప్పి రోజాపై అసభ్యంగా మాట్లాడడం సబబు కాదని అన్నారు. బుద్ధా వెంకన్న చంద్రబాబు పాఠశాలలలో చేరినప్పటి నుంచి రాజకీయంగా హుందాతనాన్ని విస్మరించి మాట్లాడుతున్నారని అన్నారు. 

టీడీపి నాయకుడు లోకేష్ విదేశాల్లో మహిళలతో విచ్చలవిడిగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయని, ఇంట్లో పనమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీపై సిపిఐ రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios