Asianet News TeluguAsianet News Telugu

మొన్న పింక్ డైమండ్‌, నిన్న బంగారం తరలింపు: టీటీడీ చుట్టూ వివాదాలే

టీటీడీ బంగారం తరలింపు సందర్భంగా చెన్నైలో ఎన్నికల అధికారులకు పట్టుబడటంతో పాటు పరకామణిలో వివాదాల కారణంగా మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
 

controversies on ttd board
Author
Tirumala, First Published Apr 26, 2019, 2:06 PM IST

టీటీడీ బంగారం తరలింపు సందర్భంగా చెన్నైలో ఎన్నికల అధికారులకు పట్టుబడటంతో పాటు పరకామణిలో వివాదాల కారణంగా మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

పింక్ డైమండ్‌తో మొదలు:

కోట్ల రూపాయల విలువ చేసే పింక్ డైమండ్ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి తిరుమలలో వివాదాలు ఆరంభమయ్యాయి. పింక్ డైమండ్‌ను విదేశాల్లో కోట్లాది రూపాలయకు విక్రయించారని ఆలయ ప్రధానార్ఛకులు రమణ దీక్షితులు ఆరోపించడం సంచలనం సృష్టించింది.

ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తిరుమలలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే శ్రీవారి పోటులో రహస్యంగా తవ్వకాలు జరిపారని ఆయన ఆరోపించారు.

అనేక మంది రాజులు శ్రీవారికి సమర్పించిన విలువైన కానుకలను ఎక్కడ దాయాలో తెలియక దానిని ఆలయ ప్రదక్షిణ ప్రాకారంలో పూడ్చిపెట్టారని బ్రిటీష్ కాలంలో కలెక్టర్‌గా పనిచేసిన జేమ్స్ స్టార్టన్ రచించిన పుస్తకాన్ని సొరకాయల కృష్ణారెడ్డి అనే టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి మన ఆలయ చరిత్ర పేరుతో తెలుగులోకి అనువదించారు.

అప్పట్లో తహశీల్దార్‌గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు.. రాజులు శ్రీవారికి సమర్పించిన కానుకలను బండల కింద ఎక్కడ పూడ్చి పెట్టారో తెలుసుకునేందుకు తవ్వకాలు జరిపారని తెలిపారు. అయితే తనకు, తనతో పాటు పనిచేసే వారికి ఆకస్మాత్తుగా జబ్బు చేయడంతో ఆయన ఆ పనిని అపచారంగా భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లుగా కృష్ణారెడ్డి తెలిపారు. 

వివాదాస్పదమైన బంగారం తరలింపు:
తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ముందు రోజు రాత్రి రూ.400 కోట్లకు పైగా విలువచేసే 1,381 కిలోల బంగారం తరలింపు వ్యవహారం వివాదాస్పదమైంది. తొలుత దీనితో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపిన టీటీడీ కొన్ని గంటల తర్వాత అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినదేనని ప్రకటించింది.

కోట్ల విలువ చేసే బంగారం తరలింపు సందర్భంగా ఎటువంటి భద్రత లేకుండా తీసుకురావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిని మరోచోటికి తరలిస్తుండగా పట్టుబడిందా?. అధికారులు పట్టుకోవడంతో టీటీడీ ట్రెజరీకి చేరిందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే శ్రీవారికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా కొందరు అధికారులు కమీషన్లకు ఆశపడి ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం సందేహాలు రేకిత్తిస్తోంది. 

తవ్వకాల కోసమే ఆలయం మూసివేశారా:

2017 డిసెంబర్ 8 నుంచి 30 వరకు మహా సంప్రోక్షణం పేరుతో ఆలయం మూసివేతపై రమణ దీక్షితులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. క్రీస్తు పూర్వం 1150లో నిర్మించిన ఈ పోటులో మూడు వేళలా మూడు రకాల ప్రసాదాలు తయారు చేసి స్వామి వారికి నివేదిస్తారు. అయితే డిసెంబర్ 20న పోటును పరిశీలించిన తనకు తవ్వకాలు చూసి ఆశ్చర్యపోయానని, పురాతనమైన గోడలను, బండలను పగులగొట్టడం చూసి బాధవేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ హయాంలో జిల్లా కలెక్టర్ రాసిన విధంగా బండల కింద దాగివున్న నిధుల కోసమే తవ్వకాలు జరిగాయాని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. అసలు శ్రీవారి ఆలయంలో ఏం చేయాలన్నా ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టాల్సి ఉంటుందని.. పోటులో చేపట్టిన పనులకు సంబంధించి ఎవ్వరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా ఎందుకు పనులు జరిపారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని చెబుతున్న టీటీడీ, ఆ సమయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని బయటపెడితే నిజానిజాలు తెలుస్తాయని.. కానీ టీటీడీ ఆ ప్రయత్నం చేయకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోందన్నారు. ః

బంగారం, నగదు ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ ఎందుకు:

తిరుమల శ్రీవారికి కోట్లాది మంది భక్తులు బంగారు, వెండి, నగదు రూపంలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా సుమారు రూ.1000 కోట్లను టీటీడీ ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ప్రభుత్వ బ్యాంకులు ఉన్నా.. ప్రైవేట్ బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయాల్సి వచ్చిందని కొందరు కోర్టును ఆశ్రయించారు.

దీంతో టీటీడీ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలాగే లడ్డూ పోటును విస్తరించే క్రమంలో ఉగ్రాణం వద్ద ఉన్న గోడను తొలగించి పెద్దది చేయాలని టీటీడీ భావించినట్లు సమాచారం.

ఆ గోడను తొలగించేందుకు టీటీడీ రూ.2 కోట్లతో టెండర్ పిలిచింది.  అయితే గోడను పగులగొట్టేందుకు రూ.2 కోట్లతో టెండర్ పిలిచి నిధులు దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా వెండి వాకిలి వద్ద భక్తులకు వీలుగా ఉండేందుకు మెట్లను ఏర్పాటు చేశారు.

ఇందు కోసం రూ. 33 లక్షలను ఖర్చు చేసినట్లుగా తేలింది. అయితే ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉండటంతో దానిని వెంటనే తొలగించారు. ఇలా టీటీడీ నిధులను కొందరు తమ స్వలాభం కోసం ఖర్చు చేస్తున్నారు. 

గోవిందరాజస్వామి కిరీటాల చోరీ వెనుక టీటీడీ నిర్లక్ష్యం:

శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు అలంకరించిన కిరీటాల చోరికి టీటీడీ నిర్లక్ష్యమే కారణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని దర్యాప్తులోనూ టీటీడీ ఎక్కడా శ్రద్ధ పెట్టినట్లుగా కనిపించలేదు.

చోరి జరిగి మూడు నెలల కావొస్తున్నా.. కిరిటాలను అపహరించిన వ్యక్తి దానిని కరిగించి సొమ్ము చేసుకున్నా ఇంత వరకు నిందితుడిపై టీటీడీ చర్యలు తీసుకోలేదు. ప్రత్యేక దర్శనాల టికెట్లు, లడ్డూలు బ్లాక్ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకోవడంలోనూ విమర్శలు ఉన్నాయి.

పాలకమండలి సభ్యులు ఎల్1,ఎల్2,ఎల్3 దర్శనాలతో పాటు వివిధ సేవా టికెట్లను బ్లాక్‌లో విక్రయించి జేబులు నింపుకుంటున్నారన్న ప్రచారం ఉంది. 

ప్రభుత్వ పెద్దల అనుచరులకు రెస్టారెంట్లు:

తిరుమలలో ఉన్న రెస్టారెంట్లు, క్యాంటీన్ల నిర్వహణను ప్రభుత్వ పెద్దల అనుచరులకు అప్పగించారన్న వాదన వుంది. అయితే ఈ క్యాంటీన్లలో టీటీడీ నిర్ణయించిన ధర అమలు కావడం లేదనే ఆరోపణలు రావడంతో వాటిని మూసివేశారు.

దీంతో ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు రెస్టారెంట్ల నిర్వహణను అప్పగించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో సందీప రెస్టారెంట్ అనే సంస్థ దరఖాస్తుకు సిద్ధమైంది.

ఆయా రెస్టారెంట్లకు నెలకు రూ.3 లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే ఇదే రెస్టారెంట్ గతంలో రూ.45.66 లక్షలు పలికింది. దీనికి ముందు వున్న మయూర హోటల్ వారు ఇదే రెస్టారెంట్‌కు నెలకు రూ.8.83 లక్షలు అద్దె చెల్లిస్తూ వచ్చారు.

ఇంతటి విలువైన రెస్టారెంట్‌ను టీటీడీ పాలకమండలి కేవలం నెలకు రూ.3 లక్షలకే కట్టబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో నెలకు రూ.42 లక్షలు, ఏడాదికి రూ.5 కోట్లు టీటీడీ నష్టపోవాల్సి వస్తోంది. ఇంత తగ్గించి అప్పజెప్పినా ఆ రెస్టారెంట్లలో భక్తులకు తక్కువ ధరకు భోజనం పెడుతున్నారా.. అంటే.. జనాన్ని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

జనతా హెటల్‌లో రూ.60 భోజనం ఉంటే.. ఏపీటీడీసీలో రూ.120 ఉంది. ఇలా అన్ని తినుబండారాల ధరలు రెట్టింపుగా ఉన్నాయి. రెస్టారెంట్‌ను దక్కించుకున్న ఏపీటీడీసీకి బదులుగా ఓ మంత్రి అనుచరుడికి దానిని నామమాత్రపు ధరకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. 

నేతల సేవకు టీటీడీ నిధులు:

తమకు నివాస స్థలాలు కేటాయించాలని టీటీడీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దాని కోసం ప్రభుత్వం భూమి కేటాయించలేదు. మరోవైపు వివిధ పనుల నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ రూ.40 కోట్లను కేటాయించింది.

అలాగే అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్న టీటీడీకి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని కేటాయించాలి.. కానీ అందుకు సర్కార్ ససేమిరా అనడంతో టీటీడీ అమరావతిలో సుమారు 12.50 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసింది.

నిత్యావసరాల కొనుగోళ్లలో గోల్‌మాల్:

తిరుమలలో శ్రీవారి భక్తులకు నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం టీటీడీ కొనుగోలు చేసే నిత్యావసర వస్తువల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఇతర పప్పుదినుసులు పూర్తిగా నాసిరకంగా ఉంటున్నాయట.

అలాగే ఆలయాన్ని సందర్శించే వీఐపీలకు కప్పే వస్త్రాలు సైతం నాసిరకంగా ఉంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సుమారు 250 రకాల వస్తువుల కొనుగోలు కోసం టీటీడీ ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తోంది. 

కరువవుతున్న శ్రీవారి అన్న ప్రసాదాలు:

తిరుమలలో లడ్డూ కాకుండా మరెన్నో అన్న ప్రసాదాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. చక్కెర పొంగలి, దద్దోజనం,సీరా, కదంబం, పులిహోరా, మలిహోరా, పాయసం, పోలీ, సుగీ, జిలేబీలను సాధారణ రోజుల్లో రోజుకు 900 కిలోలు, వారంతాల్లో సుమారు 1200 కిలోలు తయారు చేసేవారు.

వీటిని అరగించాలని భక్తులు సైతం ఆశపడేవారు. చిన్న లడ్డూను రోజులో ఒకటి రెండు గంటలు మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. మిగిలిన రోజుల్లో అంతా అన్న ప్రసాదాన్నే పంపిణీ చేసేవారు.

ప్రస్తుతం అలాంటి దృశ్యాలు కనిపించడం లేదని భక్తులు వాపోతున్నారు. ఇలా టీటీడీ చుట్టూ లెక్కలేనన్ని విమర్శలు చుట్టుముడుతున్నా.. వాటిపై ఎక్కడా విచారణ చేపట్టి నిజాలను మాత్రం వెలికితీయడం లేదని భక్తులు, సాంప్రదాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వడం లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios