రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద విషాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి ఒడిశాకు హోండాకర్ల లోడుతో వెళ్తున్న ఓ భారీ కంటైనర్ అదుపుతప్పింది. జొన్నాడ గౌతమీ బ్రిడ్జి వద్ద ఆ లారీ తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. 

ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. అయితే రహదారిపై వెళ్తున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సీఐ మంగాదేవి, ఎస్సై శుభాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంటైనర్ ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. 

అయినప్పటికీ రాకపోవడంతో ఓన్జీసీ అధికారులను సంప్రదించారు. అనంతరం భారీ క్రేన్ల సహాయంతో కంటైనర్ ను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందారు.  

తెల్లవారు జాము నుంచి కంటైనర్ ను బయటకు తీసేందుకు శ్రమించారు పోలీసులు.సుమారు ఆరుగంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎట్టకేలకు భారీ క్రేన్ల సాయంతో కంటైనర్ ను బయటకు తీశారు. లారీకి సంబంధించిన వారికి సమాచారం ఇచ్చారు.