ఖర్చులకు సరిపడా డబ్బు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఆదాయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఖర్చులను తగ్గించుకుంటారు.

రాష్ట్రం అప్పులాంధ్రప్రదేశ్ గా మారిపోతోంది. ఏం చేస్తాం. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రెవిన్యూ లోటుతో మొదలైన సంగతి తెలిసిందే? దానిపైన అనవసర ఖర్చులు, వ్యక్తిగత లబ్దికి మొదలుపెట్టిన అనేక పథకాలు కలిపి రాష్ట్రాన్ని అప్పులాంధ్రాగా మార్చేస్తోంది. అప్పులో కూరుకుపోవటమే గానీ బయటపడే దారి కనబడటం లేదు. ప్రభుత్వ వర్గాల ప్రకారం ఇప్పటికి లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో కూరుకుపోయిందట. ఏడాదికి కడుతున్న వడ్డీలే సుమారు 17 వేల కోట్లు. అందుకు కారణం పేద రాష్ట్రానికి కాస్ట్లీ సిఎం ఉండటమేనట. ఖర్చులకు సరిపడా డబ్బు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఆదాయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఖర్చులను తగ్గించుకుంటారు. కానీ రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్ లో సాగుతోంది. అప్పులు చేసైనా సరే ఖర్చులు పెట్టాల్సిందేనంటున్నారు మన సిఎం.

ఉదాహరణకు, కోట్ల రూపాయలు తగలేసి ఛాంబర్లను సిద్ధం చేసుకోవటం. హైదరాబాద్ సచివాలయంలో రెండు బ్లాకులను వాస్తు ప్రకారమే సిద్ధం చేసారు. అయినా జాతం దెబ్బకొట్టేయటంతో చివరకు హైదరాబాదే వదిలిపెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా, విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకోవాలని అనుకున్నారు సిఎం. వెంటనే అక్కడా భారీగా ఖర్చు పెట్టారు. అలాగే స్టేట్ గెస్ట హౌస్కు కూడా చమురు బాగానే వదిలింది. ఇపుడు రెండింటినీ కాదని క్యాంపు కార్యాలయంగా కరకట్టపైన ఉన్న అక్రమ కట్టడంపై ఇప్పటికి కోట్ల రూపాయలు వ్యయం చేసారు.

ఇక రాజధాని శంకుస్ధాపనంటూ మూడు సార్లు జరిపిన ఈవెంట్ మేనేజ్మెంట్లకు వందల కోట్లు వ్యయం చేసారు. హెలిప్యాడ్ల నిర్మాణం, హైదరాబాద్లో సెక్యూరిటీ పేరుతో ఇళ్ళకు, గెస్ట హౌస్ కు చేసిన ఖర్చు, రాష్ట్రంలో మూడు చోట్ల కాన్వాయ్ ఏర్పాటు పేరుతో బులెట్ ప్రూఫ్ వాహనాల ఖర్చు, బస కోసం కొనుగోలు చేసిన లక్సరీ బస్సు. ఇక వెలగపూడి నిర్మాణ వ్యయాన్నిచెప్పనే అక్కర్లేదు. అదేవిధంగా చంద్రన్న కానుకలు, గోదావరి, కృష్ణ పుష్కరాలకు చేసిన ఖర్చులు, విదేశీయానాలకు పెడుతున్న వ్యయం,మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు, భాగస్వామ్య సదస్సు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతకీ తెగదు అనవసరపు ఖర్చుల లెక్క. చంద్రన్న కానుకలు, విశాఖ ఉత్సవం లాంటివి దండగమారి ఖర్చులని మంత్రి చింతకాయలఅయ్యన్నపాత్రుడు చెప్పారంటేనే అర్ధమవుతోంది ఎన్ని కోట్లు వృధాగా పోతోందో? అందుకే పేద రాష్ట్రానికి కాస్ట్లీ సిఎం అయిపోయారు చంద్రబాబునాయుడు.