ప్రజలు తప్పు చేస్తే శిక్షించాల్సిన ఓ పోలీసే తప్పుడు పని చేశాడు. అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించిన కానిస్టేబుల్ కాలేజి వద్దనుండి లేపుకెళ్లిపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఓ మైనర్ బాలిక ఇంటర్  చదువుతోంది. అయితే ఈమెపై విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి హరి కన్నేశాడు. ప్రేమ పేరుతో వెంటపడి ఎట్టకేలకు బాలిక తన ప్రేమను అంగీకరించేలా చేశాడు. 

అయితే వీరి ప్రేమ విషయం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాలేజికి వెళ్లిన బాలికను హరి తనవెంట లేపుకువెళ్లాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఎంత వెతికినా వీరి ఆచూకీ లభించలేదు.    

దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురిని హరి కిడ్నాప్ చేశాడంటూ ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్ పై  ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి జాడ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు.