ఆ ఇద్దరు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. పక్కపక్క క్వార్టర్స్ లోనే ఉంటున్నారు. అయితే ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ భార్య  కన్నేశాడు. భర్త డ్యూటీకి వెళ్లడంతో  అత్యాచారానికి ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు. రక్షించాల్సిన పోలీసే కీచకుడిగా మారిన ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. 

విజయవాడ: ఆ ఇద్దరు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. పక్కపక్క క్వార్టర్స్ లోనే ఉంటున్నారు. అయితే ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ భార్య కన్నేశాడు. భర్త డ్యూటీకి వెళ్లడంతో అత్యాచారానికి ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు. రక్షించాల్సిన పోలీసే కీచకుడిగా మారిన ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. 

కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఆర్మడ్ రిజర్వు విభాగంలో బాలాజీ నాయక్, ఎల్లయ్య కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. బాలాజీ నాయక్ స్క్వాడ్ టీంలో పనిచేస్తుండగా ఎల్లయ్య పోలీస్ క్యాంటీన్ విధులు నిర్వహిస్తున్నాడు.

ఇద్దరు పోలీస్ క్వార్టర్స్ లోని యూ బ్లాక్ లో ఎదురెదురు ప్లాట్ లలో నివాసం ఉంటున్నారు. బాలాజీ నాయక్ డ్యూటీకి వెళ్లడంతో అతని భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ విషయాన్ని గమనించిన ఎల్లయ్య ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమెను బలవంతం చెయ్యబోయాడు. 

అదే సమయంలో డ్యూటీ నుంచి వచ్చిన బాలాజీ నాయక్ తన భార్యపై ఎల్లయ్య చేస్తున్న ఆకృత్యాన్ని చూసి అడ్డుకోబోయాడు. పట్టుకుందామని ప్రయత్నించగా ఇరువురు మధ్య కొట్లాట జరిగింది. ఈ గొడవను చూసిన చుట్టుపక్కల పోలీసులు వచ్చి ఇద్దరిని వారించారు. 

ఎల్లయ్య తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడంటూ బాలాజీనాయక్ భార్య చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎల్లయ్యను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్ విధించింది.