హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు. ఏపీలో రాజీవ్ మెమోరియల్ భవన్ కూల్చివేత నిర్ణయం సరికాదని సూచించారు. రాజీవ్ గాంధీ చేయబట్టే వైయస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని గుర్తు చేశారు. 

పీసీసీ చీఫ్ అయ్యారు కాబట్టే ఆ తర్వాత ముఖ్యమంత్రి కాగలిగారని అదంతా రాజీవ్ గాంధీ చలవేనని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి గుర్తుగా ఉన్న రాజీవ్ మెమోరియల్ భవనాన్ని కూల్చి వేస్తారా అంటూ ప్రశ్నించారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే అందుకు తానే కారణమని స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఆనాటి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా తాను మాత్రం మద్దతు పలికానని తెలిపారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీని ఒప్పించి పీసీసీ చీఫ్ గా వైయస్ రాజశేఖర్ రెడ్డిని నియమించుకున్నామని తెలిపారు. 

సోనియాగాంధీ దయతోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారని ఆ విషయాన్ని వైయస్ జగన్ గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయాల్లో కక్ష సాధింపు మంచిది కాదన్నారు. వైసీపీలో ఉన్న నాయకులు జగన్ కు మంచి సలహాలు ఇవ్వాలని వీహెచ్ సూచించారు.