కడప: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్‌ జగన్‌ చేసిన ప్రజాసంకల్ప పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కడపలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేపట్టారని విరుచుకుపడ్డారు. 

పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రోజుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే తప్ప ప్రజలకు ఏమైనా మంచి చేశారా అని నిలదీశారు. జగన్ పాదయాత్ర వల్ల మేలు జరిగిందా లేక సమస్యలేమైనా తీరాయా అని సూటిగా ప్రశ్నించారు. 

వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాదయాత్ర నిర్వహించి రాష్ట్రాన్ని ఏదో ఉద్దరించినట్లుగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 
పాదయాత్ర ద్వారా కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వచ్చిందా లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైనా వచ్చిందా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ  వచ్చిందా ఏం సాధించారంటూ నిలదీశారు. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలనే జగన్ కాపీ కొట్టారని ఆరోపించారు. వైఎస్ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసిన పథకాలేనని గుర్తు చేశారు. అసెంబ్లీని బహిష్కరించడం బాధ్యతారహితంగా వ్యవహరించడమేనని తులసీరెడ్డి అభిప్రాయపడ్డారు.