Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ వ్యాఖ్య: ఏపీని వదిలేసుకొన్న కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడే పుంజుకొనే పరిస్థితి లేదని ఆ పార్టీ భావిస్తోంది.తెలంగాణలో  అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ఆశలు పెట్టుకొంది. 

congress plans to strengthen party in Andhra Pradesh for 2019 election
Author
Amaravathi, First Published Aug 14, 2018, 2:53 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడే పుంజుకొనే పరిస్థితి లేదని ఆ పార్టీ భావిస్తోంది.తెలంగాణలో  అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ఆశలు పెట్టుకొంది. కానీ, ఏపీలో మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే 2019లో కొంత మెరుగైన ఫలితాలను సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావిస్తున్నాడు.  2024 నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

2014 ఎన్నికలకు ముందు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విడదీసింది. గతంలో ఇచ్చిన హమీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ సర్కార్  ఏర్పాటు చేసింది.

రాష్ట్ర విభజనకు  కాంగ్రెస్ పార్టీ కారణంగా భావించిన  ఏపీ ప్రజలు  2014 ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రాకుండా ఓడించారు.  ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడ ఏపీలో దక్కలేదు.  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి  తెలంగాణలో కూడ ప్రయోజనం దక్కలేదు. కేవలం 21 ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకొంది.

ఏపీలో  కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులంతా 2014 ఎన్నికలకు ముందే వైసీపీ, టీడీపీల్లో చేరారు. కొంత మంది మాత్రమే  ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందు  కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను తిరిగి  పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంది.

ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత నెలలోనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  పార్టీని ఏపీలో బలోపేతం చేసేందుకు  చర్యలు తీసుకొంటున్నారు. 

అయితే ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు.  పార్టీకి దూరమైన వర్గాలకు తిరిగి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు  వ్యూహరచన చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించిన కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ పార్టీని  బలోపేతం చేసేందుకు  రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పర్యటించారు. 

అయితే రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటుతోంది. అయినా కాంగ్రెస్ పార్టీ అంటే ఏపీ ప్రజలకు కోపం తగ్గినట్టు లేదు. గత ఏడాది జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనీస ఓట్లు కూడ రాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో  మరో ఆరు మాసాల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా  ఫలితాలు సాధిస్తోందనే భ్రమలు కూడ ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి లేవు.

వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు దక్కించుకొన్నా  గొప్పే అనే భావనలో  కాంగ్రెస్ పార్టీ శ్రేణులున్నాయి. అయితే ఈ పరిణామాలను  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవగాహన చేసుకొంది. ఏపీలో  ఇప్పటినుండే  పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొంటే  2024 నాటికైనా పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

తెలంగాణ జిల్లాల్లో పర్యటన సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మీడియా ఎడిటర్లతో నిర్వహించిన సమావేశంలో  ఏపీలో పార్టీ పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.

ఏపీలో గత ఎన్నికల కంటే మెరుగుపడతామని రాహుల్ వ్యాఖ్యానించారు.  ఇంతకంటే గొప్పగా ఫలితాలు  ఉండే అవకాశాలు లేవని రాహుల్‌ అభిప్రాయపడ్డారు.  అయితే  రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకొంటామని చెప్పారు.

మరోవైపు  తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ప్రత్యేక హోదాను ఇస్తే  ఏపీలో కాంగ్రెస్ కు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  ఈ మేరకు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎడిటర్ల సమావేశంతో పాటు తెలంగాణలో జరిగిన సభల్లో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఈ వార్తలు చదవండి

సెక్యులర్ పార్టీలతో పొత్తులు: రాహుల్‌కు చిన్నారెడ్డి సూచన
 

కాంగ్రెస్‌తోనే నా పెళ్లి జరిగింది: రాహుల్

రాహుల్ గాంధీ ఎదగాలి, స్క్రిప్ట్ చదువుతున్నాడు: కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios