హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా కేంద్రం ఇచ్చిన  హామీలను  చట్టబద్దంగా అమలు చేయించుకోవాలని  కాంగ్రెస్ ఎంపీ  కేవీపీ రామచంద్రారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ  ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు, ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. 

సోమవారం నాడు  కేవీపీ రామచంద్రారావు మీడియాకు ఈ లేఖను విడుదల చేశారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్ కేంద్రాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.

పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వ  పథకాలకు  90 శాతం నిధులు ఇవ్వాలని  ఆయన ఆ లేఖలో కోరారు. విభజన చట్టం అమలుపై రాజ్యసభలో మరోసారి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టానన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఇది చర్చకు రాలేదన్నారు. 

ఏపీకి న్యాయం చేస్తామంటూ  తిరుమల వెంకన్న సాక్షిగా  చేసిన వాగ్ధానాలను మోడీ మర్చిపోయారని కేవీపీ ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు.

ప్రత్యేక హోదా అంశంలో కుంటి సాకులతో  రాష్ట్రానికి అన్యాయం  చేస్తున్నారని ఆయన విమర్శించారు. పారిశ్రామిక పన్ను రాయితీలు రాష్ట్రానికి ఇవ్వాలని కేవీపీ డిమాండ్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న 60 శాతం నిధులకు మరో 30 శాతం లెక్కకట్టి ఇవ్వాలన్నారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ నిలబడేవరకు సహాయం అందించాలని కేవీపీ కోరారు.