రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీలో చేసిన రైతు రుణమాఫీ, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించడం, ఏడాదికి 4 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల, డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాలను ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.ప్రజలు బీజేపీని శని గ్రహంగా..టీడీపీ, వైసీపీని రాహువు, కేతువుగా చూస్తున్నారని తెలిపారు.

 గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే రైతు రుణమాఫీ చేశామని.. అందువల్లే కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన జనసేన కవాతును.. ధనసేన కవాతు అంటే బాగుండేదేమోనని అభిప్రాయపడ్డారు. కవాతులో హెలికాప్టర్ల నుంచి పూల వర్షం, ప్రత్యేక విమానాలు వంటివన్నీ చూస్తుంటే నీతులు చెప్పేందుకే ఉన్నాయనిపిస్తోందని తులసిరెడ్డి అన్నారు.

  సినిమా తరహాలో హెలికాప్టర్‌ ద్వారా జనసేన కవాతుపై పూలవర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేశారని, పేదలపార్టీకి ఈ హంగామాలకు డబ్బులెక్కడివని ప్రశ్నించారు. శ్రీకాకుళం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్‌కళ్యాణ్‌ హెలికాప్టర్‌ నుంచి పూలు చల్లించుకుంటున్నారని మండిపడ్డారు. పేదల పార్టీకి డబ్బులెక్కడివని తులసిరెడ్డి నిలదీశారు.