అయినా కాంగ్రెస్ నేతలిద్దరూ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్నవాళ్ళే కదా? మంత్రివర్గ ప్రమాణ స్వీకార విషయంలో గవర్నర్ పాత్ర నామమాత్రమేనని తెలీదా?

రామాయణంలో పిడకల వేట లాగ మధ్యలో వీళ్ళ గోలేమిటో అర్ధం కావటం లేదు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలో అర్ధం కావటం లేదు. ఎవరిని తప్పించాలో ఇంకా ఖరారు కాలేదు. మంత్రివర్గ కుర్పుపై చంద్రబాబునాయడు చేస్తున్న కసరత్తు అంగుళం కూడా ముందుకు పడలేదు. పొద్దుట నుండి ఇటు ఆశావహులను, అటు అసంతృప్తులను బుజ్జగించలేక చంద్రబాబు తల ప్రాణం తోక్కొస్తోంది. వర్గాలతోను, వైరి వర్గాలతోనే చంద్రబాబు ఓ వైపు అవస్తలు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే భాజపా, కాంగ్రెస్ వాళ్ల ఒవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. మంత్రివర్గంలోకి పనితీరే ఆధారంగా తీసుకోవాలంటూ భాజపా శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబుకు సూచిస్తున్నారు. ప్రాంతం, కులం, మతం ఆధారంగా మంత్రిపదవులు కట్టబెట్టవద్దంటూ రాజుగారు చంద్రబాబుకు చెబుతున్నారు.

ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్సీ సి. రామచంద్రయ్యతో పాటు తెలంగాణా నేత రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు (విహెచ్)లు ఏకంగా గవర్నర్ కే షరతులు విధిస్తున్నారు. వైసీపీ నుండి టిటిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలకు మంత్రివర్గంలోకి తీసుకోకూడదంటూ వారు షరతులు విధించటం విచిత్రంగా ఉంది. ఒకవేళ గవర్నర్ గనుక ఫిరాయింపు ఎంఎల్ఏలతో ప్రమాణస్వీకారం చేయిస్తే గవర్నర్ బర్తరఫ్ కోరుతూ రాష్ట్రపతిని కలుస్తానంటూ విహెచ్ బెదిరింపులకు దిగటం విశేషం.

అయినా కాంగ్రెస్ నేతలిద్దరూ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్నవాళ్ళే కదా? మంత్రివర్గ ప్రమాణ స్వీకార విషయంలో గవర్నర్ పాత్ర నామమాత్రమేనని తెలీదా? మంత్రిపదవులు ఇవ్వటం, తీసుకోవటమన్నది అధికార పార్టీ స్వవిషయం. కాంగ్రెస్, భాజపా విషయాల్లో ఇతర పార్టీల వారు సలహాలిస్తే ఒప్పుకుంటారా? ఏమిటో వీళ్ల ఓవర్ యాక్షనూ వీళ్ళూను.