విజయవాడ: బినామీల పేరుతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో 32 వేల ఎకరాల భూమి ఉందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎన్త తులసిరెడ్డి, ఎస్కే మస్తాన్ వలీ ఆరోపించారు. దాని విలువను పెంచుకోవడానికే జగన్ రాజధానిని మారుస్తున్నారని వారన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయపెడుతామని వారు చెప్పారు .

పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మొత్తం అభివృద్ధికి విఘాతం కలిస్తున్నారని వారు మంగళవారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జగన్ ఆస్తులు కూడబెట్టారని వారన్నారు. 

ఆ భూములపై ప్రేమతో జగన్ రాజధానిని మారుస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రపై జగన్ ఏ విధమైన ప్రేమాభిమానాలు కూడా లేవని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. 

సచివాలయం, రాజభవన్, శాసనసభ, శాసన మండలులను కలిపి రాజధాని అంటారని, హైకోర్టు రాజధాని పరిధిలోకి రాదని వారు చెప్పారు. దేశంలో దాదాపు 20 హైకోర్టులు రాజధాని వెలుపల ఉన్నాయని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు వైఎస్ జగన్ కూడా రాయలసీమ ద్రోహులేనని వారు వ్యాఖ్యానించారు. 

సార్వత్రిక ఎన్నికల సమయంలోనే రాజధానిని మారుస్తామని జగన్ ప్రకటించి ఉంటే వైసీపీకి 20 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావని అన్నారు. జగన్ నిజంగా మొనగాడైతే అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని వారు డిమాండ్ చేశారు లేకపోతే జగన్ మోసగాడిగా మిగిలిపోతాడని అన్నారు.