విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కరోనా కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని చాలామంది మృత్యువాతపడగా మరికొందరు మరింత అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు కమిటీలు ఏర్పాటుచేసింది. 

ప్రమాదానికి గల కారణాలు, ఇతర అంశాలపై విచారణ చేపట్టేందుకు ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఆరోగ్యశ్రీ సీఈవో, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లు ఈ కమిటీలో సభ్యులుగా వుండనున్నారు. రమేష్ హాస్పిటల్ లో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స, ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్వారం టైన్ సెంటర్లలో రోగుల భద్రతపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. 48 గంటల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

read more   స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం.. భార్య కోసం ఆగి..

ఇక ఈ స్వర్ణా ప్యాలెస్ హోటల్లో ఫైర్ సేఫ్టీ లోపాలపై విచారణ జరిపేందుకు మరో కమిటీ ఏర్పాటయ్యింది. అగ్నిమాపక శాఖ డీజీ, ఫోరెన్సిక్ లాబ్ డైరెక్టర్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ లు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటయ్యింది. స్వర్ణ ప్యాలెస్ తో పాటు ఇతర హోటళ్లలో నడిచే కోవిడ్ సెంటర్లలో అగ్నిప్రమాద నివారణ చర్యలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఈ కమిటీ. రెండు రోజుల్లోగా ఈ కమిటీ విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వనుంది. 

ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై జిల్లా స్థాయిలో కూడా ఓ విచారణ కమిటీ ఏర్పాటుచేశారు. కృష్ణా జిల్లా జేసీ శివశంకర్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈకమిటీలో సభ్యులుగా సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జి.గీతాబాయి, ఆర్‌ఎఫ్‌వో ఉదయ్‌కుమార్‌, విద్యుత్‌ డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ లు వున్నారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా నిబంధనలపై పూర్తి విచారణ చేయాలని ఈ కమిటీకి జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.