2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. నేను పోటీ చేసేది ఎక్కడి నుంచంటే : కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సినీనటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే బరిలో నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి తాను పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారాన్ని అలీ ఖండించారు.

వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి సినీనటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజమండ్రిలో ఓ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే బరిలో నిలుస్తానని తెలిపారు. రాజమండ్రి నుంచి తాను పోటీ చేస్తానంటూ జరుగుతున్నది ప్రచారమేనని అలీ స్పష్టం చేశారు. ఇక ఈ టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లు మంచి ప్రతిభ కనబరిచి అత్యున్నత స్థాయికి ఎదగాలని అలీ ఆకాంక్షించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కొన్ని వందల చిత్రాలు చిత్రీకరణ జరుపుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తానని అలీ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. విమర్శలు ప్రతి విమర్శలు చేయటం సాధారణమని.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని అలీ అన్నారు.
Also REad: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం..జగన్ ఆదేశిస్తే చాలు : కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుండగా.. నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలీ.. రాజకీయాలకు కూడా అప్పుడప్పుడూ కాస్త దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్య పరిచారు . అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది వైసీపీ. దీంతో పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగింది కూడా. కానీ, అది జరగలేదు. దాంతో అలీ చాలా డిజప్పాయింట్ గా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే అవకాసం ఉందని వార్తలు వచ్చాయి. అలీ గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు మళ్లీ అటు సొంతగూట్లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదట. పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ఉన్న స్నేహం కారణంగా జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే.. వైసీపీలో అలీ చేరిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సినిమా ఇండస్ట్రీ కాస్త దూరం పెట్టిందని కూడా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో వున్నంత వరకూ సినిమా అవకాశాలు పుష్కలంగా ఉన్న అలీకి ఇప్పుడు పూర్తిగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం వైసీపీలో చేరడమే అంటున్నారు అలీ సన్నిహితులు. అయితే కొత్త నీరు ఇండస్ట్రీకి రావటం, కొత్త కమిడియన్స్ పరిశ్రమలో పరిచయం కావటం, పాత డైరక్టర్స్ తగ్గటం కారణం అని సినీ వర్గాలు అంటున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇంతవరకు ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఎలాంటి పదవీ రాలేదు. అటు సినిమాలు లేక.. ఇటు పదవీ రాక తనలో తానే ఆందోళన చెందుతున్న సమయంలో అలీకి జగన్ గుడ్‌న్యూస్ చెప్పారనే అనుకోవాలి.