అనంతపురం: ఒక గ్రూపు రక్తానికి బదులు మరో  గ్రూప్ రక్తం ఎక్కించిన నలుగురు వైద్యాధికారులపై సర్కార్ వేటు వేసింది. ఈ ఘటన అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకొంది.

తాడిపత్రి పట్టణానికి చెందిన  అక్తర్‌బాను గర్భిణీ ప్రసవం కోసం ఈ నెల 27వ తేదీన అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చేరింది.సిజేరియన్ చేసే సమయంలో  గర్భిణీకి ఓ పాజిటివ్ కు బదులుగా బీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో రియాక్షన్‌కు గురై ఆమె మృతి చెందింది.

బాధితురాలి భర్త ఈ విషయమై  ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అయితే  ఆసుపత్రి సిబ్బంది బుకాయించారు. ఈ విషయాన్ని  రహస్యంగా ఉంచే ప్రయత్నం చేశారు.అయితే మీడియా ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.దీనిపై కలెక్టర్ సత్యనారాయణ విచారణ చేశారు.

ఓ పాజిటివ్‌కు బదులుగా బి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్టుగా తేలింది. శుక్రవారం నాడు ఆసుపత్రిలో విచారణ జరిపే సమయంలో కూడ  ఆసుపత్రి సిబ్బంది  కలెక్టర్‌ను కూడ ఏమార్చే ప్రయత్నం చేశారు. చివరికి  బాధితురాలికి ఒక్క గ్రూప్‌కు బదులుగా మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కించారని తేలినట్టుగా  కలెక్టర్  చెప్పారు.

ఈ ఘటనకు బాధ్యులైన  నలుగురిపై వేటు వేశారు. బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షలు పరిహారం  చెల్లించాలని నిర్ణయం తీసుకొంది.