Asianet News TeluguAsianet News Telugu

ఏపీని వణికిస్తున్న చలి.. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. మరో మూడు రోజులే ఇదే పరిస్థితి..

ఆంధ్రప్రదేశ్‌పై చలి పంజా విసురుతోంది. రెండు, మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఉదయం 10 గంటల వరకు కూడా పొగ మంచు వీడటం లేదు.

cold wave in andhra pradesh continues for next three days
Author
First Published Jan 10, 2023, 10:25 AM IST

ఆంధ్రప్రదేశ్‌పై చలి పంజా విసురుతోంది. రెండు, మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఉదయం 10 గంటల వరకు కూడా పొగ మంచు వీడటం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని చింతపల్లి మండలంలో ఆదివారం 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు  కాగా.. సోమవారం 2 డిగ్రీలుగా నమోదైంది. మంగళవారం ఉదయం చింతపల్లిలో 3 డిగ్రీలుగా, లంబసింగిలో 2 డిగ్రీలుగా, మినమలూరులో 7 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతంలోని కడపలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 8.3 డిగ్రీల సెల్సియస్‌,  అనంతపురంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 5.6 డిగ్రీల తగ్గుదల నమోదైంది. చలిగాలుల ప్రభావం వల్లే ఉష్ణోగ్రతలలో తగ్గుద నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, ఉదయం పూట రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే రహదారులపై లైట్ల వెలుతురులో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. 

సోమవారం ఉదయం రాష్ట్రంలోని తొమ్మిది వాతావరణ కేంద్రాల్లో 14 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం కడపలో 10.2 డిగ్రీలు, అనంతపురంలో 11.9 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజాబ్, హర్యానా తదితర ఉత్తరాది ప్రాంతాల నుంచి శీతల గాలులు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తుండడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

రాష్ట్రంలో ఈ నెల 13 వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని.. ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చలితీవ్రత పెరగడంతో అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య కాస్తా తగ్గుముఖం పట్టింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios