జోరుగా కోళ్ళ పందేలకు ఏర్పాట్లు

First Published 29, Dec 2017, 5:37 PM IST
cockfight arrangements  going on  in full swing in Andhra
Highlights
  • సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ప్రభుత్వానికి ఎక్కడ లేని చికాకులు మొదలవుతాయి.

సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ప్రభుత్వానికి ఎక్కడ లేని చికాకులు మొదలవుతాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, సంక్రాంతి పండుగ అంటేనే అందరకీ గుర్తుకు వచ్చేది కోళ్ళ పందేలు. కోడి పందేలకు ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలు ఫేమస్. అయితే, కొంతకాలంగా కోడి పందేల నిర్వహణపై కోర్టు ఆంక్షలు విధిస్తోంది. ఎట్టి పరిస్దితుల్లోనూ కోడిపందేలు నిర్వహించకూడదంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. పోయిన సంక్రాంతి పండుగ సందర్భంగా ఇదే విషయమై పెద్ద రచ్చే జరిగింది.

సరే, కోర్టు అంత చెప్పిన తర్వాత పందేలు ఏమన్నా ఆగాయా అంటే ఎక్కడా ఆగలేదు. పైగా అంతకుముందు కన్నా ఇంకా ఎక్కువయ్యాయి. ఎందుకంటే, కోళ్ళ పందేల నిర్వహణలో ఎక్కువ పాత్ర అధికార పార్టీ నేతలదే ఉంటుంది. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు మొదలు గ్రామస్ధాయి నేతల వరకూ మొత్తం పార్టీ నేతలందరూ పోటీలు జరిగే చోటే ఉంటారు.  పోటీల నిర్వహణకు మద్దతుగా గ్రామ పంచాయితీలు ఏకంగా తీర్మానాలే చేసేస్తున్నాయి.

అంతమంది అధికారపార్టీ నేతలు దగ్గరుండి స్వయంగా పోటీలు నిర్వహిస్తుంటే ఇక పోలీసులు ఏం చేయగలరు? పోలీసులంటే అంతా అధికారపార్టీ నేతలపై ఆధారపడ్డవారే. అందుకే కోర్టు ఆదేశాలు ఎక్కడా అమలు కావటం లేదు. తానిచ్చిన ఆదేశాలు అమలు కాకపోతే కోర్టులు మాత్రం ఏం చేయగలవు?

ప్రతీసారీ లాగే రానున్న సంక్రాంతి పండుగకు కూడా కోస్తా జిల్లాల్లో కోళ్ళ పందేలకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలే ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూస్తున్నారు. ప్రతీ సారి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కోళ్ళపందేల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారిపోతాయి. భీమవరం ప్రధాన కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లాలో వందలమంది కోళ్ళపందేలకు సిద్దమైపోతున్నారు.

అలాగే, తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, కాకినాడ, పెద్దాపురం లాంటి అనేక చోట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పందేలు ఉభయగోదావరి జిల్లాలకు మాత్రమే కాకుండా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా పాకాయి. పందేలలో పాల్గొనేందుకు విదేశాలనుండి సైతం వస్తుంటారు. అందుకే భీమవరంలోని హోటళ్ళు, గెస్ట్ హౌస్ లే కాకుండా తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా పేయింగ్ గెస్టులుగా ఉంటారు. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని హోటళ్ళు  కూడా ఇప్పటికే బుక్ అయిపోయాయట. కోళ్ళపందేలకు ఈ స్ధాయిలో భారీ ఏర్పాట్లు జరిగిపోతున్నపుడు కోర్టులు మాత్రం ఏం చేయగలవు?

 

loader