ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి పేరుతో సోషల్ మీడియాలో సర్క్యలేట్ అవుతున్న లేఖపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాాబు క్లారిటీ ఇచ్చారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) సతీమణి వైఎస్ భారతి (ys bharati) ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఆమె రాసినట్లుగా ఓ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లేఖపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu) క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతమ్మ ఏదో లెటర్ రాసినట్లు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోందని... కానీ ఆమె ఎలాంటి ఉత్తరం రాయలేదని ఎమ్మెల్యే అంబటి తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లెటర్ భారతమ్మ రాసింది కాదు నకిలీదని తెలిపారు. ఎవరో కావాలని ఇలాంటి ఉత్తరాలు సర్క్యులేట్ చేస్తున్నారని... అటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే అంబటి సూచించారు.
రాష్ట్ర ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుకు తన మనసులోని ఆందోళన, భయాలను చెప్పడానికి ఉత్తరం రాస్తున్నట్లుగా వైఎస్ భారతి పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. ''రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకం అమలుచేసిన అది వాళ్ల అబ్బ సొత్తు కాదని... వాళ్ల జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు చేయడం లేదు. ప్రజల డబ్బులను తిరిగి ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. కానీ నాయకుడంటే సమన్యాయం చేస్తూ దూరదృష్టితో పనిచేయాలని... ఇదే మంచి ఫలితాలను ఇస్తుంది'' అంటూ వైఎస్ భారతి రాసినట్లుగా ప్రచారమవుతున్న లేఖలో వుంది.
ఈ నకిలీ లేఖను వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాలే సృష్టించాయని వైసిపి నాయకులు పేర్కొంటున్నారు. దూరదృష్టితో పనులు చేస్తానని చెప్పుకునే చంద్రబాబే సరయిన నాయకుడని వైఎస్ భారతి పేర్కొన్నట్లుగా లెటర్ వుందని అంటున్నారు. భర్త సీఎంగా వున్నా రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి చూపించని వైఎస్ భారతి ఇలాంటి లేఖ రాసివుండదని పేర్కొంటున్నారు. ఎవరో కుట్రపూరితంగా ఆమెపేరిట నకిలీ లేఖ సృష్టించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు కోరుతున్నారు.
