Asianet News TeluguAsianet News Telugu

మామకు వెన్నుపోటు పొడిచి కూర్చీ లాక్కుంటే చంద్రబాబు.. రాజకీయాలు చెడిపోయాయి: సీఎం జగన్ ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వస్తే ఒక ఎంజీఆర్‌, ఒక ఎన్టీఆర్, ఒక జగన్ అని అంటారని.. మామకు వెన్నుపోటు పొడిచి కూర్చీ లాక్కునేవారిని చంద్రబాబు అంటారని విమర్శించారు.

CM YS Jagan Slams Chandrababu In Public meeting in srikakulam Narasannapeta
Author
First Published Nov 23, 2022, 1:16 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వస్తే ఒక ఎంజీఆర్‌, ఒక ఎన్టీఆర్, ఒక జగన్ అని అంటారని.. మామకు వెన్నుపోటు పొడిచి కూర్చీ లాక్కునేవారిని చంద్రబాబు అంటారని విమర్శించారు. సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు. జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష కార్యక్రమం తొలి విడత లబ్దిదారులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 

అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా చెప్పారు. 2 వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని.. 7,92,238 మందికి భూ హక్కు పత్రాలు అందిస్తున్నట్టుగా తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశలో 4 వేల గ్రామాల్లో సర్వే చేయనున్నట్టుగా చెప్పారు. 2023 మే కల్లా 6వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు అందుతాయని తెలిపారు. వచ్చే ఏడాది చివరినాటికి రాష్ట్రమంతా సమగ్ర సర్వే పూర్తి అవుతుందని చెప్పారు. రికార్డులు సరిగా లేకపోవడం, మ్యూటేషన్‌ సరిగా లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని.. ఎలాంటి వివాదాలకు తావుఉండకూడదని అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. భూ వివాదాలన్నింటికీ చెక్ పెడతామని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా మరో 17 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు ఇచ్ఛాపురంలో కిడ్నీ సమస్య కనిపించలేదా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక కిడ్నీ బాధితుల కోసం ఆర్థిక సాయం ప్రకటించామని చెప్పారు. ఇచ్చాపురంలో 765 కోట్ల రూపాయలతో కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయిన చెప్పారు. కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి కూడా కడుతున్నామని.. దాని పనులు 90 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. డయాలసిస్ పేషెంట్లకు రూ. 10 వేలు పెన్షన్ ఇచ్చే విధంగా మార్పు తీసుకురావడం జరిగిందని తెలిపారు. 

మార్పులు, సంస్కరణలు 11  వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాలను ఇకమీదట భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల రిజస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చే ప్రక్రియకు ఈరోజు శ్రీకారం చూడుతున్నట్టుగా చెప్పారు. ఇంతకుముందు 295 సబ్ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు ఉండేవని.. ఇప్పుడు 11 వేల గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రేషన్ సేవలు అందే మార్పు జరుగుతుందని చెప్పారు. 

‘‘తన ఆస్తిని తాను అనుభవిస్తే వాళ్లను హక్కుదారులు అంటారని సీఎం జగన్ చెప్పారు. అదే పరాయి వాడిని ఆస్తిని అక్రమిస్తే వారిని కబ్జాదారులు అంటారు. తన భార్యతో సంసారం చేస్తే, ఆమె కోసం యుద్దం చేస్తే. ఆ మనిషిని శ్రీరాముడు అని  అంటారు. అదే పరాయి స్త్రీ మీద కన్నువేసి ఎత్తుకుపోతే అలాంటి వాళ్లను రావణుడు అంటారు. తనకు తాను పార్టీ పెట్టుకుని ఎవరైనా అధికారంలోకి వస్తే.. వాళ్లను ఒక ఎంజీఆర్‌, ఒక ఎన్టీఆర్, ఒక జగన్ అని అంటారు.

కానీ మరి ఎవరైనా సొంత కూతురిని ఇచ్చిన మామను, మామ పెట్టిన పార్టీని, మామ పెట్టిన ట్రస్టును, చివరకు మామకు ప్రజలు ఇచ్చిన సీఎం కూర్చీని.. వెన్నుపోటు పొడిచి కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారు. రావణుడి సమర్థించిన వాళ్లను రాక్షసుడని అంటాం. దుర్యోధనుడిని కొమ్ముకాసిన వాళ్లను దుష్టచతుష్టాయం అని  అంటున్నాం. మామ కూర్చీని కబ్జా చేసి, మామ పార్టీని దందా  చేసి, ఎన్నికలప్పుడు ప్రజలకు మాయ మాటలు చెప్పి.. ఆ తర్వాత ప్రజలకు మాయ మాటలు చెప్పి.. ఆ తర్వాత ప్రజలను గాలికొదేలేసి, మోసం చేసే చంద్రబాబును సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిని, టీవీ5ను, దత్తపుత్రుడిని ఏమనాలి?. వీళ్లను దుష్టాచతుష్టాయం, రాక్షస మూక అనాలి’’ అని సీఎం జగన్ విమర్శించారు.

‘‘గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటను నాయకులు నిలబెట్టుకోవాలని.. అప్పుడే దానిని నిజమైన ప్రజస్వామ్యం అంటారు. గెలిపించిన ప్రజలను అనేకసార్లు మోసం చేసి, వెన్నుపోటు పొడిచిన నాయకుడిని మరోసారి అసెంబ్లీకి పంపాలా? మీ సేవలు మాకొద్దని బై బై చెప్పి ఇంటికి పంపాలా? అనేది ప్రజలు ఆలోచన చేయాలి. రావణుడికి, దుర్యోధనుడికి, మోసం చేసేవారికి, వెన్నుపోటు పొడిచేవారికి మరో చాన్స్ ఎవరైనా ఇస్తారా?.

ఈ రోజు రాజకీయాలు చెడిపోయాయి. రాజకీయాలు అంటే ఒక జవాబుదారీతనం ఉండాలి. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేస్తేనే.. ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారు.. లేకుంటే అధికారంలో నుంచి పోవాలనే మేసేజ్ పోవాలి’’ అని సీఎం జగన్ అన్నారు.

తాను దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదని.. ప్రజలను, దేవుడి దయను నమ్ముకున్నానని సీఎం జగన్ చెప్పారు. మంచి జరిగి ఉంటే ప్రజలు తనకు అండగా నిలబడాలని.. మోసాన్ని, అబద్దాలను నమ్మవద్దని కోరారు.   

Follow Us:
Download App:
  • android
  • ios