తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ స్పందించారు. వర్చువల్ విధానంలో ఎపీ పోలీసు డ్యూటీ మీట్ ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎండోమెంట్ పరిధిలోకి కూడా రాని, తెలుగుదేశం నేతల పర్యవేక్షణలో ఉన్న వాటిలో ఈ ఘటనలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పద్ధతి ప్రకారం కుట్రలు చేస్తున్నారని, పొలిటికల్ గొరిల్లా వార్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి, పోలీసులకు చెడ్డపేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని, వీటిని ఎలా అరికట్టాలన్న దానిపై కూడా మేదోమథనం చేయాలని సీఎం జగన్ అన్నారు.

‘‘దేవుడన్న భయం లేకుండా పోతోంది. దేవున్ని కూడా రాజకీయాలలోకి తీసుకొస్తున్నారు‌. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో గుళ్ళలో విగ్రహాలను ఎంచుకుని ధ్వంసం చేస్తుంటే, అక్కడ ప్రతిపక్షాలు ఆగడాలకు దిగుతున్నాయి. అలాంటి కేసులను కూడా సమర్థవంతంగా తేల్చగలగాలి. 

దేవుడి విగ్రహాలు కూల్చితే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలకు పాల్పడుతున్నారో.. ప్రజలు ఆలోచన చేయాలి. ప్రభుత్వంలో ఏదైనా మంచి కార్యక్రం జరిగి పబ్లిసిటీ వస్తుందనే.. డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు చేస్తున్నారు. 

2019లో నాడు-నేడుకు ప్రాధాన్యత వస్తుందని తెలిసి దుర్గ గుడి ధ్వంసం అని దుష్ప్రచారం చేశారు. 2020 జనవరిలో రైతులకు ధరల స్థిరీకరణ చేస్తే.. ఆంజనేయ స్వామి గుడి ధ్వంసం అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ పబ్లిసిటీని అడ్డుకోవడం కోసం కొన్ని గుడులను ధ్వంసం చేసి, రధం కాలిపోయిందని ప్రచారం చేశారు. మహిళల సంపూర్ణ వికాసం కార్యక్రమం చేస్తే అంతర్వేది రధం కాలిందని ప్రచారం చేశారు. వెండి సింహాలు మాయం అయ్యాయి. 

రైతు జలసిరి కార్యక్రమం మొదలు పెడితే నెల్లూరులో ఓ ఆలయంలో విగ్రహం ధ్వంసం అయ్యింది. విద్యాదీవెనకు మూడు రోజుల ముందు నుంచే ధ్వంస రచన జరిగింది. కర్నూలులో లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఘటన జరిగింది. బీసీల కోసం చరిత్రాత్మక చర్యలు చేపడితే వీరభద్ర స్వామి ఆలయం ధ్వంసం అన్నారు. 

ఇంటి పట్టాలు ఇస్తావుంటే తిరుమల ఆలయంలో పూర్ణకుంభం లైటింగ్ లో శిలువ అని ప్రచారం చేశారు. విజయనగరంలో ఇంటి పట్టాలు ఇస్తున్నారని తెలిసి రాముల వారి ఆలయంలో దాడి చేశారు’’ అని వ్యాఖ్యానించారు. 

గత ఆరేళ్లుగా డ్యూటీ మీట్ జరగలేదని, ఇక ఆగదని ఆయన అన్నారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఒక వేదికగా డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందన్నారు. సైబర్ టెక్నాలజీ, మహిళల రక్షణ మీద దృష్టి సారించాలన్నారు. పోలీసు శాఖకు మరింత మెరుగైన పనితీరు కనబరచేందుకు 'ఇగ్నైట్' దోహదపడాలన్నారు. పోలీస్ స్టేషనుకు వచ్చిన ప్రజల మొహాలలో చిరు నవ్వులు చూడగలుగుతున్నామా అన్నదానికి ఇగ్నైట్ మార్గం చూపాలన్నారు. సొసైటీలో రెండు శక్తులు ఎప్పుడూ ఉంటాయి. 

ఎప్పుడూ చెడు మీద ఆధార పడి జీవించే శక్తులు కొన్ని, చెడును అడ్డుకుంటూ మంచిని కాపాడే శక్తులు కొన్ని ఉంటాయి. అది గమనించి పని చేయాలి. తప్పు ఎవరు చేసినా.. పార్టీలు, రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా పని చేయాలి. తప్పు మావాళ్ళు చేసినా వదిలేయొద్దని ఆదేశాలిచ్చాను. దురదృష్టకరంగా రాజకీయాలు మారాయి. 18నెలల కాలంలో ఏ వ్యత్యాసం లేకుండా పాలన సాగిస్తుంటే ప్రతిపక్షానికి కంటకమైంది. ఓర్వలేక కుయుక్తులు, కుట్రలు చేస్తున్నారు. సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు చూస్తుంటే కలియుగంలో క్లైమాక్స్ వస్తున్నట్లు అనిపిస్తోంది.