అమరావతి: రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించాలని సీఎం సూచించారు. విశాఖలో ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూనివర్శిటీపైనా... ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీలో అంశాలపైనా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో ఏపీకి చెందిన ప్రాంతంలో...మూడుచోట్లా కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌సిటీలను ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ కాన్సెప్ట్ ‌సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని...నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ యునిక్‌గా ఉండాలని సూచించారు. ప్రతి కాన్సెప్ట్‌ సిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలన్నారు. 

పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని... ఐటీ ప్రగతికి, రాష్ట్రాభివృద్ధికి సహాయపడాలన్నారు. అన్ని అంశాలపై ఆలోచనలు చేసి మంచి పాలసీని తీసుకురావాలన్నారు. కోవిడ్‌ లాంటి మహమ్మారి నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం పెరిగిందని... దీన్ని ప్రమోట్‌ చేయాలన్నారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏరకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపునుంచి సహకారం అందిస్తామో పరిశీలనచేసి, దాన్ని పాలసీలో పెట్టాలన్నారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌పై దృష్టిపెట్టాలని... వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలి, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలి సీఎం జగన్ ఆదేశించారు. 

read more వారు సర్పంచ్ లే... ఏకగ్రీవాలను అడ్డుకోడానికి మీరెవరు..: నిమ్మగడ్డపై జోగి రమేష్ ఆగ్రహం

''వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అన్ని గ్రామాలకూ కల్పించడమన్నది చాలా ముఖ్యం. ఐటీ రంగం అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ బలంగా లేకపోతే... అనుకున్న లక్ష్యాలు సాధించలేం. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలి. ఇంటర్నెట్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలి. గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఉండాలి. వర్క్‌ ఫ్రం హోం చేసుకునే సదుపాయం ఉంటుంది. వర్క్‌ ఫ్రం హోంకు అవసరమైన అన్ని సదుపాయాలూ ఇందులో పెట్టాలి. ఈ లైబ్రరీ కోసం భవనం కూడా కట్టాలి. దీనిపై కార్యాచరణ రూపొందించండి'' అని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.  

ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి,  ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఐటీ శాఖ స్పెషల్‌ సెక్రటరీ బి సుందర్, ఇంధనశాఖ  కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సాంకేతిక విద్యాశాఖ  కమిషనర్‌ ఎం ఎం నాయక్,  ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ  ఎం మధుసూదన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.