కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు సీఎం జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సీఎం అధ్యక్షతన జరిగింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
''కోవిడ్ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ, ఉపాధిమార్గాలు దెబ్బతిన్నాయి. కోవిడ్ కారణంగా ప్రాణాలుకూడా కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తంకూడా ఇదే రకంగా దెబ్బతింది.దీంతో గడచిన 20ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గింది. దీని తదనంతర సంవత్సరం అంటే 2020–21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇతరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది'' అని సీఎం పేర్కొన్నారు.
''దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో అయితే 24.43శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. 2020–21లో దేశ జీడీపీ 7.25శాతం మేర తగ్గితే ఏపీలో 2.58శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లే'' అంటూ అభినందించారు సీఎం జగన్.
''గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణపంపిణీ ఉన్నట్టు గణాంకాలద్వారా తెలుస్తోంది. అదే సమయంలో పంటరుణాలు 10.49శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం'' అన్నారు.
read more 17 రాష్ట్రాలకు కేంద్రం ఊరట, రెవెన్యూ లోటు నిధుల విడుదల.. ఏపీకి ఎంతంటే..!
''కౌలురైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఇప్పటివరకూ 4,91,330 క్రాప్ కల్టివేటర్ రైట్‌కార్డ్స్ (సీసీఆర్‌సీలను) ఇచ్చాం. వీరికి సీసీఆర్‌సీ కార్డులను ఇవ్వడమే కాదు, ఆ డేటాను ఇ–క్రాపింగ్‌లో పొందుపరిచాం. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? ఈ వివరాలను ఆర్బీకేలకు, ఇ–క్రాపింగ్‌కు, సీసీఆర్‌సీ కార్డులకు డేటాను అనుసంధానం చేశాం. ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగుచేస్తున్న రైతులు. సీసీఆర్‌సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్థారిస్తున్నాం, అంతేకాదు వీరు ఎక్కడ పంటను సాగుచేస్తున్నారో ఇ–క్రాపింగ్‌ద్వారా పరిశీలనచేసి ధృవీకరిస్తున్నాం. వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి. వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ కూడా పంటరుణాలు అందడం చాలా ముఖ్యమైన విషయం. వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నులైన వారికి కచ్చితంగా రుణాలు అందాలి'' అని సీఎం జగన్ కోరారు.
''రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి.
ఆర్బీకేల్లోనే ఇ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్ చేసి మరీ ఇ–క్రాపింగ్ చేస్తున్నాం. పంటను సాగుచేస్తున్న రైతుకు డిజిటల్ రశీదే కాదు, భౌతిక రశీదుకూడా ఇస్తున్నాం. ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు, వ్యవస్థలను గ్రామాల్లో ఉంచాం. వీటిని వినియోగించుకోగలిగితే సమాజానికి బాగా మేలు జరుగుతుంది. ఇ–క్రాపింగ్ అనేది సీసీఆర్‌సీ కార్డులకే కాదు, వడ్డీలేని పంటరుణాలకు, ఇన్‌పుట్ సబ్సిడీకే కాదు, ఇన్సూరెన్స్‌కు.. .ఇలా అన్నింటికీ అనుసంధానం అవుతుంది. దీనివల్ల బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు భద్రత కూడా ఉంటుంది'' అని సీఎం తెలిపారు.
''ఇప్పటికే బ్యాంకర్లు 9160 ఆర్బీకేలను మ్యాపింగ్ చేసి అక్కడ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడం ముదావహం. ఇప్పటికే 6538 కరస్పాండెంట్లను పెట్టడం ప్రశంసనీయం. మిగిలిన చోట్లకూడా వీలైనంత త్వరగా బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించాలని కోరుతున్నాను. ప్రతి ఆర్బీకే కేంద్రంలో ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండాలి. ఆ బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఆర్బీకేను వినియోగించాలి. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెంట్ సేవలు ఆర్బీకే వినియోగించుకోవాలి. ఇ–క్రాపింగ్ ప్రక్రియలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ భాగం కావాలి. ఇది అంతిమంగా డిజిటలైజేషన్ మార్గంలో పెద్ద అడుగు అవుతుంది'' అని సీఎం జగన్ పేర్కోన్నారు.
''బ్యాంకింగ్ విషయంలో వైయస్సార్ జిల్లాలో 100శాతం డిజిటలైజేషన్ పూర్తిచేశామని చెప్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ అంటే ఏంటని అడిగితే.. ఖాతాదారులందరికీ ఏటీఎం సదుపాయం కల్పించడం, క్రెడిట్‌కార్డులు ఇవ్వడం, ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం, ఆన్‌లైన్ సదుపాయం కల్పించడం అనిచెప్పారు. ఇది మంచిదే. కాని ఇవి ఇస్తేనే డిజిటలైజేషన్ పూర్తికాదనేది నా భావన. గ్రామాల్లోని ఆర్బీకేల్లో ఉన్న మీ బ్యాంకింగ్ బిజినెస్ కరస్పాండెంట్లు.. బ్యాంకులుగా మారినప్పుడే డిజిటలైజేషన్ దిశగా గొప్ప అడుగు వేసినట్టు. వ్యవసాయానికి సంబంధించి రుణాలు ఇవ్వడం, ఇ–క్రాపింగ్ ద్వారా వారికి రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ ఆర్బీకేల్లోని బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా చేయగలిగితే గొప్ప విప్లవాన్ని మనం చూడగలుగుతాం'' అని సీఎం జగన్ పేర్కొన్నారు.
