ఇటీవల ప్రకటించిన పార్టీ పదవులకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిందనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
వైసీపీ (ysrcp) నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి (vijayasai reddy) అప్పగించిన బాధ్యతల్లో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) మార్పులు చేశారు. సజ్జలకు ఎమ్మెల్యేలు, మీడియా కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించగా.. విజయసాయిరెడ్డికి రీజనల్, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. గతంలో విజయసాయికి కేవలం అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
కాగా... ఇటీవల 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైసీపీ అధినేత, సీఎం జగన్ నియమించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishana reddy) మీడియాకు వెల్లడించారు. అయితే ఈ నియామకాల్లో పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు అవకాశం కల్పించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కలేదనే అసంతృప్తిలో ఉన్నవారిలో కొందరికి ఈ నియామకాలలో అవకాశం కల్పించారు. ఈ విధంగా వారిలో ఉన్న అసంతృప్తిని చలార్చే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం వైసీసీలో జగన్ తర్వాత విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే వైసీపీలో నెంబర్ 2గా భావించే ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ నియామకాల్లో ఒకింత షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే.. గత కొంతకాలంగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయసాయి రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అక్కడ ఓ వెలుగు వెలిగి.. విశాఖ అంటే విజయసాయి అన్నట్టుగా వ్యవహరించిన ఆయనకు ఇది ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి అనే చర్చ సాగుతుంది. అంతేకాకుండా విజయసాయి రెడ్డిని పూర్తిగా ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి తప్పించారు.
కేవలం పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డిని నియమించారు. అయితే విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతల నుంచి తప్పించడానికి.. ఆయన తీరుపై ఆ ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు ఉన్న అసంతృప్తి, ఫిర్యాదులే కారణమనే చర్చ సాగుతుంది.
ఇక, సజ్జలకు పార్టీ పరంగా మరిన్ని బాధ్యతలను అప్పజెప్పారు. గతంలో కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల స్థానంలో కర్నూలు, నంద్యాల బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతలను సజ్జల, బుగ్గన సంయుక్తంగా చూడనున్నారు. దానితో పాటు ప్రాంతీయ సమన్వయకర్తల, పార్టీ జిల్లా అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా సజ్జలకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. దీంతో పార్టీలో సజ్జలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని.. అదే సమయంలో విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది.
దీనిపై విజయసాయిరెడ్డి స్వయంగా స్పందించారు. ప్రాంతీయ పార్టీలలో అధినేత ఆదేశాలను పాటించడమే శిరోధార్యమని ఆయన వ్యాఖ్యానించారు. నాకు ఇది కావాలి, ఇది వద్దు అనే ప్రస్తావన ఎక్కడా రాకూడదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన తనకు జగన్ చాలా అవకాశాలను ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అధినేత ఇచ్చిన బాధ్యతలు నేరవేర్చడమే తన కర్తవ్యమని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
