ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళతారు. సీఎం జగన్ సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి చేరుకుంటారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. రేపు ఉదయం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలోనే వీరి భేటీ జరగనుందని సమాచారం. మరోవైపు అమిత్ షాతో కూడా సీఎం జగన్ భేటీ కానున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చలు జరపనున్నారని అంటున్నారు.
అయితే సీఎం జగన్ సడన్‌గా ఢిల్లీ టూర్‌కు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. నేడు అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో జగన్ పర్యటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే సీఎం జగన్.. ఢిల్లీ టూర్ వెనక కారణాలు తెలియాల్సి ఉంది.
