అమరావతి ఆర్ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన..
అమరావతి ఆర్ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెయం లేఅవుట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అమరావతి ఆర్ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెయం లేఅవుట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించిన లేఅవుట్లలోని 50,793 ఇళ్ల నిర్మాణానికి, 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు సీఎం జగన్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కృష్ణాయపాలెయం లేఅవుట్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అలాగే వన మహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. అలాగే అక్కడ నిర్మించిన నమునా ఇంటిని కూడా సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం సీఎం జగన్ వెంకటపాలెం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.
ఇక, ఆర్ 5 జోన్‌లోని 25 లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణానికి రూ. 1,371.41 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు గానూ రూ. 384.42 కోట్లు వెచ్చించినునట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రూ. 73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ గ్రంథాలయాలు, 12 ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇక, 5 నుంచి 6 నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది.
సీఆర్‌డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలతో కూడిన 25 లేఅవుట్‌లలో 50,793 మంది పేదలకు ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన సంగతి తెలిసిందే.
ఇక, అమరావతి రైతుల అభ్యంతరాలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆరు నెలల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతుల ముసుగులో కొందరు రియల్టర్లు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారని ఆరోపించారు.