అమరావతి: తమది మహిళ పక్షపాత ప్రభుత్వమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు.

వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 87.75 లక్షల మందికి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. మొదటి విడతగా ఈ పథకం డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,792 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. నాలుగు దఫాల్లో రూ. 27,168 కోట్లను ప్రభుత్వం అందించనుంది. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  డ్వాక్రా సంఘ సభ్యులతో మాట్లాడారు.ఈ డబ్బులను ఎలా వాడుకొంటారనేది మీ ఇష్టమని ఆయన  చెప్పారు. మహిళా సాధికారిత కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల నాటికి  రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల అప్పు మొత్తాన్ని చెల్లించనున్నట్టుగా సీఎం తెలిపారు.

రాష్ట్రంలోని మహిళల చరిత్రను తిరిగి రాయడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.అమ్మ కడుపులోని బిడ్డ నుండి అవ్వకు సహాయం చేసేందుకు వీలుగా తమ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు. 

శిక్షణ, సాంకేతిక సహకారం కూడ అందించనున్నట్టుగా  సీఎం చెప్పారు. తాము తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్  చేసుకొనేందుకు పలు సంస్థలతో కూడ ఒప్పందం చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మహిళల భద్రత, సంక్షేమం కోసం ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.రాష్ట్రంలో 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేసిన విషయాన్ని ఆయన ప్రకటించారు. మద్యాన్ని నియంత్రించేందుకు ధరలను పెంచినట్టుగా సీఎం చెప్పారు.