తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో వైసీపీ నేతల మధ్య తలెత్తిన వివాదం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు  సీఎం.

వివాదానికి కారణాలను సీఎంకు వివరించనున్నారు ఎంపీ బోస్, ఎమ్మెల్యే చంద్రశేఖర్. ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.

దీనిపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలా వసూలు చేశారు..? ఎవరు వసూలు చేశారో చెప్పాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మరోసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ మెడలైన్ వంతెన గురించి ప్రస్తావించారు.

ఈ వంతెన నిర్మాణం విషయంలో అభ్యంతరం తెలిపారు సుభాష్. కాకినాడ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా మునిగిపోయే మెడలైన్ వంతెన నిర్మాణాన్ని ఆపేయాలని సూచించారు.

అయితే, దీనిపై కూడా ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం మాటల తూటాలు పేలాయి. ఇద్దరు నేతలు వెనక్కి తగ్గకుండా వాదులాడుకున్నారు.

ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అర్థంతరంగా డీఆర్సీ సమావేశాన్ని వాయిదా వేశారు. మొత్తానికి డీఆర్సీ మీటింగ్‌లో సుభాష్ బోస్, ద్వారంపూడి ఆర్గ్యూమెంట్‌, పార్టీ అధిష్టానం దృష్టికి సైతం వెళ్లింది. సొంత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధమేంటని ఆరా తీశారట.