అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మిక, కర్షక లోకానికి సీఎం జగన్ తో పాటు గవర్నర్, టిడిపి చీఫ్ చంద్రబాబు, నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కార్మిక, కర్షకలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికన కార్మికులకు మే డే (may day) శుభాకాంక్షలు తెలిపారు.
''శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు'' అంటూ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ట్వీట్ చేసారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలుపుతూనే వైసిపి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ''శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారు. నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో అల్లాడిపోతుంటే.... కార్మిక లోకం తల్లడిల్లి పోతుంది. కనీసం కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో వుంది'' అంటూ ఆందోళన వ్యక్తం చేసారు.
''ఇప్పటికైనా కార్మిక లోకమంతా ఒక్కతాటిపైకి వచ్చి వైసిపి ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్పూర్తితో పోరాడాలి. కార్మిక, శ్రామిక లోకానికి మేలు చేసే ఏ పోరాటానికైనా తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుంది'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) కూడా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ''శ్రామిక, కార్మిక వర్గాల భాగస్వామ్యం లేనిదే ఏ పాలకుడు కూడా అద్భుతాలు సాధించలేరు. అటువంటి ప్రగతి నిర్మాతల న్యాయమైన కోర్కెలను మన్నించడం ప్రభుత్వాల విధి. ప్రస్తుతం అణచివేతలను ఎదుర్కొంటున్న శ్రామిక, కార్మిక వర్గాలకు మంచిరోజులు రావాలని ఆకాంక్షిస్తూ... ప్రజలందరికీ మే డే శుభాకాంక్షలు'' అని లోకేష్ ట్వీట్ చేసారు.
ఇక ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhushan harichandan) కూడా మే డే శుభాకాంక్షలు తెలిపారు. ''మే డే ను పురస్కరించుకుని గవర్నర్ బిశ్వభూషన్ కార్మికులకు సల్యూట్ చేస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు చారిత్రాత్మక త్యాగాలకు, ఉద్యమాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను గుర్తుచేస్తున్నాయి. వీటివల్లే కార్మికుల ప్రస్తుతం సరయిన న్యాయం జరుగుతోంది'' అని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు.
