ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు.

సంఘ సంస్కర్తలు, కవులు, కళాకారులు మన సమాజానికి పునాదులని.. వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నిర్మూలిస్తేనే అభివృద్ధిలో ముందుకెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతగా దగాపడలేదని.. పదేళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు.

Also Read:ఆరేళ్ల తర్వాత మళ్లీ... జగన్ వల్లే సాధ్యం...: మంత్రి వెల్లంపల్లి

భవిష్యత్ తరాలు బాగుపడేలా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నామని... విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు బాగుపడేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఐదేళ్ల తర్వాత రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందని.. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని నిరూపించుకుందామని జగన్ పిలుపునిచ్చారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ప్రస్తుతం ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కలిసి ముందుకు సాగి అన్నింటినీ అధిగమించి అభివృద్ధిలో దూసుకెళ్దామని సీఎం తెలిపారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. ఏపీకి గవర్నర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యమున్న రాష్ట్రమని పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్పనేలన్నారు.

Also Read:సీఎం జగన్ ఫోటోకు 108 సిబ్బంది పాలాభిషేకం...

స్వాతంత్ర్య పోరాటంలో చీరాల-పేరాల ఉద్యమం ఎప్పటికీ మరువలేమని.. విజయవాడను మహాత్మాగాంధీ ఆరుసార్లు సందర్శించారని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారి పాలిట సింహస్వప్నంగా నిలిచారని.. భాషాప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు ఉందన్నారు.

పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి గర్వకారణంగా నిలిచారని బిశ్వభూషణ్ తెలిపారు. కాగా.. స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన వారి వారసులను గవర్నర్, ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. 

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మనసు పెట్టి ఏకాగ్రతతో, అకుంఠిత దీక్షతో, సానుకూల దృక్పథంతో, అంకితభావంతో, రాజకీయాలకు అతీతంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు.

Also Read:మద్రాస్, హైదరాబాద్ ల అభివృద్దిలో ఆంధ్రులే కీలకం...మరి సొంతరాష్ట్రంలో...: తమ్మినేని

శుక్రవారం ఉదయం సచివాలయంలోని అసెంబ్లీ హాల్ మొదటి సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరగలేదని గుర్తేచేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు నేడు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు.