అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ పడి పడి నవ్వారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక హోదా గురించి చర్చించారు. ఈ సందర్భంగా సభా నాయకుడు జగన్ ప్రత్యేక హోదాపై తీర్మానం చేశారు. 

ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వద్దని, ప్రత్యేక హోదానే కావాలని సీఎం జగన్ ప్రకటన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని జగన్ ఈ సందర్భంగా విమర్శించారు. అనంతరం ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడారు.

ప్రత్యేక హోదాపై సభలో తీర్మానం చేయడం సంతోషకరమైన విషయమని చెప్పారు. రాష్ట్రానికి హోదా సాధించే విషయంలో తాము పూర్తిగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. హోదా కాకుండా ప్యాకేజీ కి ఎందుకు ఒకే చేయాల్సి వచ్చిందో అప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నం  చేశారు. హోదా సాధించే క్రమంలో తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లానని చంద్రబాబు అన్నారు.

కాగా.. చంద్రబాబు 29సార్లు ఢిల్లీ పర్యటన మాట ఎత్తగానే సీఎం జగన్ వెంటనే పడి పడీ నవ్వేశారు. జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలందరూ నవ్వడం గమనార్హం. వెంటనే స్పందించిన స్పీకర్ తమ్మినేని సతీరాం పరిస్థితిని సరిచేశారు.