విజయవాడ: తుపాకీ మిస్ ఫైర్ అయ్యి హోంగార్డు భార్య మృత్యువాతపడిన సంఘటన గొల్లపూడిలో చోటుచేసుకుంది. తుపాకీని భార్యను చూపిస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో బులెట్ ఆమె శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే హోంగార్డు భార్య మృతిచెందింది. 

ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెక్యురిటి వింగ్ ఏఎస్పీ శశికాంత్ వద్ద హోమ్ గార్డ్ వినోద్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఏఎస్పీ శశికాంత్ క్యాంప్ కు అనంతపురం వెళుతూ తుపాకీని వినోద్ వద్ద ఉంచాడు. 

ఈ తుపాకీని తన ఇంట్లో దాచిన వినోద్ నిన్న రాత్రి భార్య సూర్యరత్నప్రభ చూపించడానికి బయటకు తీశాడు. ఈ క్రమంలో సరదాగా తుపాకీని చూపిస్తున్న సమయంలో అదికాస్తా మిస్ ఫైర్ అయ్యింది. దీంతో బుల్లెట్ నేరుగా సూర్యరత్నప్రభ గుండెల్లోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.   

తెల్లవారుజామున 2గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సూర్యరత్నప్రభ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం తుపాకీని స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.