ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ది కోసం మహా యజ్ఞం నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మే 12 నుంచి మే 17 వరకు ఆరు రోజుల పాటు ‘‘అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం’’ నిర్వహించనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం, తాను చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావడం కోసం పలు సందర్భాల్లో కేసీఆర్ యాగాలు, పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పద్దతినే జగన్ ఫాలో అవుతున్నారు. ఏపీ సంక్షేమం, అభివృద్ది కోసం మహా యజ్ఞం నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మే 12 నుంచి మే 17 వరకు ఆరు రోజుల పాటు ‘‘అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం’’ నిర్వహించనున్నారు. ఈ యజ్ఞంలో సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో యజ్ఞం ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యజ్ఞం నిర్వహించనున్నామని తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ‘అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం’ జరగనున్నట్టుగా చెప్పారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం మే 12 నుంచి 17 వరకు యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్దిలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి ప్రకృతి నుండి మద్దతు పొందడం కోసం ఈ యజ్ఞం అని అన్నారు.
Also Read: ఇప్పటికైనా మేల్కోండి..: దెబ్బతిన్న పంటలతో కూడిన ట్రక్కును కేసీఆర్‌కు పంపేందుకు షర్మిల యత్నం..
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల గురించి మాట్లాడుతూ.. వరుణ దేవుడు వర్షం కురిపించి యజ్ఞశాలను శుద్ధి చేశాడని, ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ఆచారాల ప్రకారం ముఖ్యమంత్రి సీఎం జగన్ మే 12న యజ్ఞాన్ని ప్రారంభించనున్నారని.. మే 17న ఆయనే ముగిస్తారని చెప్పారు. ఇది రాష్ట్రంలో సంక్షేమ పథకాలను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ యాగం విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
