రెండో విడత అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నెల్లూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 9.45 నిమిషాలకు ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ఆయన నెల్లూరుకు బయలుదేరి వెళ్తారు. 11.10 నిమిషాలకు పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా వేణుగోపాల స్వామి కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.40 నిమిషాలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు.

అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లికి బయలుదేరుతారు.

కాగా, రెండో విడత అమ్మ ఒడి పథకం కింద 6,612 కోట్ల రూపాయలను ఆర్ధిక శాఖ విడుదల చేసింది. ఈ పథకం కింద 44,08,921 మంది లబ్దిదారులకు 15 వేల రూపాయల నగదు మొత్తాన్ని బదిలీ చేస్తుంది. 

అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి కొత్త పథకాలను గానీ, ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలను గానీ అమలు చేయకూడదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయినప్పటికీ అమ్మ ఒడి పథకం ప్రారంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.