శ్రీకాకుళం: మహిళా సంఘాల ఖాతాల్లోకి నేరుగా సున్న వడ్డీ రుణాలు అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.వంద రోజుల పాలనలో అనేక ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టినట్టుగాఆయన వివరించారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో పీడీఎస్  పథకం ద్వారా సన్న బియ్యం (నాణ్యమైన బియ్యం)  పంపిణీని ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు.  ఉద్ధానం కిడ్నీ సెంటర్ కు
రూ.50 కోట్లతో 200 పడకల ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన చేశారు.రూ.11.95 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి కూడ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పాదయాత్రలో అందరి సమస్యలు విన్నాను. ఆ సమస్యలను పరిష్కరించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

కిడ్నీ బాధితులకు పెన్షన్ రూ. 10వేలు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.ఈ మేరకు తాను తొలి సంతకం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఉద్ధానం ప్రాంతంలో రూ.600 కోట్లతో రక్షిత మంచినీరు అందించనున్నట్టు సీఎం జగన్ తెలిపారు.

ఈ ఏడాది అక్టోబర్ 15 నుండి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా జగన్ ప్రకటించారు. ప్రతి రైతుకు  రూ. 12,500లను పెట్టుబడి సాయంగా అందిస్తామన్నారు. తాను పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వంద రోజుల పాలన పూర్తైన రోజునే  శ్రీకాకుళం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం  పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

శ్రీరామనవమి రోజునే వైఎస్ఆర్ పెళ్లి కానుకను అందించనున్నట్టుగా ఆయన తెలిపారు. స్వంత కార్లు, ఆటోలు నడిపే వారికి రూ. 10వేల ఆర్ధిక సహాయం అందిస్తామని ఈ సహాయం సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందిస్తామని జగన్ తెలిపారు.

వచ్చే ఏడాది ఉగాది రోజున ఇళ్లు లేని పేదలకు ఉచితంగా ఇంటి స్థలాల పట్టాలతో పాటు ఇంటి నిర్మాణాలు చేసి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.  ఈ ఏడాది నవంబర్  21 నుండి మత్స్యకారుల కోసం ప్రత్యేక పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.