తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడు మాట్లాడుతున్న మాటలు వింటున్న, వాడుతున్న భాష చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నగరిలో జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడడని.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదని.. ప్యాకేజ్ ఇచ్చి దత్తపుత్రుడును తీసుకొచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. వెన్నుపోట్లు, మోసం, అబద్దాలతోనే చంద్రబాబు అడుగులు ముందుకు వేశాడని విమర్శించారు.
చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడు మాట్లాడుతున్న మాటలు వింటున్న, వాడుతున్న భాష చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని అన్నారు. ప్రతి మాటలో రెచ్చగొట్టాలని, గొడవలు పెట్టాలని, శవ రాజకీయాలు చేయాలనేది వీరి ఉద్దేశమని విమర్శించారు. పుంగనూరు, అంగళ్లలో కార్లలో తుపాకులు పెట్టుకుని తిరగారని.. పోలీసులపై రాళ్లు రువ్వారు, బీరు బాటిళ్లు, కర్రలతో దాడి చేశారని మండిపడ్డారు. పర్మిషన్ ఉన్న రూట్‌లో ప్రయాణించమని పోలీసులు అడగడమే పాపం అయిందని అన్నారు. 47 మంది పోలీసుల మీద దాడి చేశారని.. ఓ పోలీసు సోదరుడి కన్ను కూడా పొగొట్టారని చెప్పారు. ఈ ఘటనలో పోలీసులు ఏదైనా కాలిస్తే.. శవ రాజకీయాలను చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని ఆరోపించారు.
చంద్రబాబు ఆయనపై హత్యయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబే దొంగ ఓట్లు ఎక్కించుకుని.. మళ్లీ తాము ఎక్కించుకున్నట్టుగా ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్లడం ఆశ్చర్యమేస్తుందని అన్నారు. ఎన్టీఆర్ సీఎం కూర్చీని లాక్కుని, వెన్నుపోటు పోడిచారని, పార్టీని లాక్కుని, ఆయన చావుకు కూడా వీళ్లే కారణమయ్యారని ఆరోపించారు. ఇదే దుర్మార్గుడు.. ఎన్టీఆర్ శవాన్ని లాక్కున్నారని, ఫొటోకు దండం పెడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ పేరు మీద కాయిన్ రిలీజ్ చేస్తుంటే.. చంద్రబాబు నిస్సిగ్గుగా పాల్గొంటున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
Also Read: చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడడు.. సీఎం జగన్ ఫైర్
చంద్రబాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులను, పిల్లలను కూడా వదలకుండా మోసం చేశారని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా చంద్రబాబు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు అందమైన మేనిఫ్టెస్టో తీసుకొస్తారని.. ఎన్నికల అయిపోయాక దానిని మాయం చేస్తారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు స్వర్గం చూపిస్తారని.. అధికారంలోకి వస్తే నరకం చూపిస్తారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, విపరీతమైన అప్పులు ఉన్నాయని.. కానీ తాను వెనకడుగు వేయలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు కోవిడ్ సమస్య పట్టి పీడించిన.. కారణాలు చెప్పకుండా మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేశామని చెప్పారు. 2,33,000 కోట్ల రూపాయలను అక్కాచెల్లమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేశామని తెలిపారు. చంద్రబాబు పాలన కంటే తన పాలనలో అప్పుల గ్రోత్ రేట్ తక్కువ అని అన్నారు. అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో అన్న విధంగా పాలన సాగిందని.. కానీ ఇప్పుడు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయని చెప్పారు.
తమ ప్రభుత్వం ఎంత మంచి చేసినప్పటికీ.. మారీచులతో యుద్దం చేస్తున్నామని చెప్పారు. అబద్దాన్ని నిజమని చెప్పే వ్యవస్థలతో యుద్దం చేస్తున్నామని అన్నారు. తనలో కల్మషం లేదని.. తాను నమ్ముకుంది చేసిన మంచిని మాత్రమేనని అన్నారు. ‘‘మీ ఇంట్లో మంచి జరిగిందా?లేదా? అనేది కొలమానంగా తీసుకొండి.. మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి’’ అని జగన్ కోరారు.
