Asianet News TeluguAsianet News Telugu

అమరావతి ఇక మనందరి అమరావతి.. పేదలకు అండగా మార్పు మొదలైంది: సీఎం జగన్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు నేతృత్వంలోని పెత్తందార్ల కూటమికి మధ్య యుద్దం జరుగుతుందని అన్నారు.

CM Jagan says Amaravati now became all of us amravati ksm
Author
First Published Jul 24, 2023, 12:17 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు నేతృత్వంలోని పెత్తందార్ల కూటమికి మధ్య యుద్దం జరుగుతుందని అన్నారు. పేదలకు మంచి జరిగితే చూసి ఓర్వలేని రాక్షస మనస్తత్వం వారిదని మండిపడ్డారు. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోవాలనేది పెత్తందార్ల మనస్తత్వం అని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ అమరావతి  ఆర్ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా  కృష్ణాయపాలెయం లేఅవుట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం సీఎం జగన్ వెంకటపాలెం చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదల శత్రువులతో ఎన్నో సంఘర్షణల తర్వాత, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని పేదలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అందుకే ఇది రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే రోజు అవుతుందని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు రాకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, వారి అనుకూల మీడియా అడ్డుకుందని విమర్శించారు. పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకునేందుకు హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్లారని.. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఏపీలో మాత్రమే ఉందని అన్నారు. పేదలకు ఇళ్లు రాకూడదని పెత్తందార్లు హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారని అన్నారు. 

మూడేళ్ల పాటు ఈ కేసులను పరిష్కరించేందుకు.. పేదల తరఫున తాను పోరాటం చేశారని చెప్పారు.  హైకోర్టులో, సుప్రీం కోర్టులో కేసులు గెలిచి.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేకుండా ఆపలేకపోవడంతో పెత్తందార్లు ఇళ్ల నిర్మాణాలు జరగకుండా ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులకు కలవడంతో పాటు ఎక్కని గడప, దిగని గడప లేదని అన్నారు. చివరిగా హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి మరెక్కడా ఉండదని అన్నారు. అయితే వాటన్నింటిని అధిగమించి దేవుడి దయతో అడుగులు ముందుకు వేశామని తెలిపారు. ఇది పెత్తందారులపై పేదల ప్రభుత్వ విజయంగా చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతుందని అన్నారు. 

పేదల ప్రజలకు అవినీతి తావులేకుండా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్ అని.. అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే అని.. మరి ఈ సంక్షేమ పథకాలు గత చంద్రబాబు  ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 

అమరావతిని పేరుకేమో రాజధాని అంటారని.. పేదలకు సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామంటే మాత్రం కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఇస్తే అభివృద్ది జరగదని వాదిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీలను, టీవీ డిబేట్లను, దౌర్భగ్యమైన రాజకీయాలను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రజలు వీటన్నింటిని ఆలోచన  చేయాలని కోరారు. 

పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అవసరమా? అని అడ్డుతగిలే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారని అన్నారు. పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ వారు హీరోయిజంగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బినామీల  అమరావతిలో ఉండేందుకు అమెరికా నుంచి, సింగపూర్ నుంచి మనుషులు రావొచ్చంటా.. కానీ చుట్టుపక్కల గ్రామాల్లోని  పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని దిగజారుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. 

అయితే పేదలకు అండగా మార్పు మొదలైందని జగన్ అన్నారు. అమరాతిని సామాజిక అమరావతిగా పునాదిరాయి వేస్తున్నామని  చెప్పారు. అమరావతి ఇక మన అందరి అమరావతి కాబోతుందని అన్నారు. 50,793 మంది అక్కాచెల్లమ్మలకు వారి పేరు మీదే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని.. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని వారు కోరడంతో.. ఆ బాధ్యతను ప్రభుత్వమే సంతోషంగా స్వీకరిస్తుందని చెప్పారు. 

సీఆర్‌డీఏ పరిధిలో అన్ని సౌకర్యాలతో ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2 లక్షల 70 వేల ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం విలువే రూ. 7. 5 లక్షలు అని.. మౌలిక సదుపాయాల కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇవన్నీ పూర్తయ్యే సరికి ఒక్కొక్కరికి  ఇంటి విలువ 12 నుంచి 15 లక్షలు పలుకుతుందని అన్నారు. నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలతో ఎంతో మంచి చేస్తున్నామని చెప్పారు. ఇక, సీఎం జగన్ ప్రసంగం తర్వాత పలువురు లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను అందజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios