Asianet News TeluguAsianet News Telugu

మాండూస్ తుఫాన్ బీభత్సం.. పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. ప్రజలకు ఇబ్బందులు కలకుండా చూడాలని ఆదేశం

మాండూస్ తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

CM Jagan Review on mandous cyclone situation
Author
First Published Dec 10, 2022, 1:30 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో మాండూస్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాండూస్ తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పారు. 

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. అవసరమైతే పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి తుఫాన్ బాధిత ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని నిశితంగా పరిశీలించాలన్నారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వర్షాభావ జిల్లాల కలెక్టర్లతో వేర్వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు శని, ఆదివారాల్లో గ్రామాల్లో పర్యటించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జవహర్ రెడ్డి కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఎన్యుమరేషన్‌ చేపట్టేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ అర్దరాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. తీరం వెంట 75 కి.మీ వేగంతో గాలులు వీచాయి. ప్రస్తుతం తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. మండూస్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండూస్ తుఫాన్‌కు సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

మండూస్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్నిచోట్ల హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోయాయి.  చాలా చోట్లు పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

 వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. 

భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో చెట్లు విరిగిపడ్డాయి. మరోవైపు తిరుమలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో అన్ని జలశయాలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు తీర్థాలకు వెళ్లే మార్గాలను టీటీడీ మూసేసింది. 

నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సోమశిలకు  భారీగా వరద వస్తుందని అంచనా వేసిన అధికారులుముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేశారు. పరిహహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios