Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థులకు ఐపాడ్, డాంగిల్... టోఫెల్‌ తరహా పరీక్షలు: సీఎం జగన్

విద్యావ్యవస్థలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలు అమలుతో సహా నాణ్యమైన విద్యకోసం తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులకు అహారం అందించే గోరుముద్ద పథకంపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

cm jagan review meeting on education department
Author
Amaravathi, First Published Jul 21, 2020, 7:37 PM IST

అమరావతి: విద్యావ్యవస్థలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలు అమలుతో సహా నాణ్యమైన విద్యకోసం తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులకు అహారం అందించే గోరుముద్ద పథకంపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. మానవవనరుల సమర్థ వినియోగం, ఉత్తమమైన బోధన తదితర అంశాలపై సంబంధిత  అధికారులతో సీఎం చర్చించారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 

స్కూలు పిల్లలకోసం రూపొందించిన పాఠ్యపుస్తకాలను ముఖ్యమంత్రి  పరిశీలించారు. స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే బాగుంటుందని సమావేశంలో  అధికారులు ప్రతిపాదించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 55వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని...అందులో దాదాపు 35వేల కేంద్రాలకు భవనాలు లేవని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొత్త భనాల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు జరుగుతోందని.. ప్రైమరీ స్కూళ్ల కు సమీపంలోనే అంగన్‌వాడీలు ఉండాలంటే... ముందుగా ఆయా స్కూళ్లలో తగిన స్థలాలు ఉన్నాయా? లేవా? అన్నదాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు పరిశీలన చేసి మ్యాపింగ్‌తో ఒక నివేదిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. 

పీపీ–1, పీపీ–2 క్లాసులను కూడా ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో చర్చించారు. పీపీ–1, పీపీ–2 పిల్లలకూ నాణ్యమైన విద్యనందించే దిశగా చర్యలుండాలన్నారు సీఎం. వీరికీ పకడ్బందీ పాఠ్యప్రణాళిక ఉండాలన్నారు. ఒకటో తరగతి నుంచి బోధించే పాఠ్యాంశాలు, పీపీ–1, పీపీ–2 పాఠ్యాంశాల మధ్య  సినర్జీ ఉండాలన్నారు. 

రాష్ట్రంలో జూనియర్‌ కాలేజీల స్థితిగతులపైనా సమావేశంలో చర్చ జరిగింది. 270  మండలాల్లో జూనియర్‌ కాలేజీలు లేవని  అధికారులు వివరించారు. ప్రతి మండలానికో హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా మార్చేలా ఇదివరకే తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తామన్నారు ముఖ్యమంత్రి. అలాగే ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కాలేజీల్లో కూడా ఖాళీలను భర్తీచేయడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ఆదేశించారు. జూనియర్‌ కాలేజీల్లో పోటీ పరీక్షలకు అవసరమైన విధంగా విద్యార్థులకు బోధన అందించాలన్నారు. 
జాతీయస్థాయిలో ఐఐటీ, జేఈఈలాంటి పోటీ పరీక్షలకు వారిని సిద్ధంచేసే దిశగా కార్యాచరణ ఉండాలన్నారు. 

read more   ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు: చంద్రబాబుపై సుచరిత వ్యాఖ్యలు

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక భవనం ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక శిక్షణ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఉపాధ్యాయులకిచ్చే శిక్షణ కార్యక్రమంలో కూడా సరైన పాఠ్యప్రణాళికను అనుసరించాలన్నారు. ప్రైవేటు స్కూళ్లపై పర్యవేక్షణ, నియంత్రణల విషయంలో కమిషన్‌ ఇచ్చిన మార్గదర్శకాల అమలును సీఎంకు వివరించారు అధికారులు. ప్రైవేటు స్కూళ్లకు అక్రిడేషన్‌ విధానం ఉండాలని...వాటి ఫీజులపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. 

''ప్రతి ఏటా ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలు ఉండాలి. అధికారికంగా ఫిర్యాదు చేసుకునేందుకు కంప్లైంట్‌ బాక్స్‌ ఉండాలి. ఇందుకోసం ఒక మంచి యాప్‌ తీసుకు రావాలి. అదే సమయంలో ఇక్కడ లంచాలకు, ప్రలోభాలకు తావు ఉండకూడదు'' అని సీఎం సూచించారు. 

ప్రాథమిక విద్య పరిధిలోకి పీపీ–1, పీపీ–2, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు, మండలానికి ఒక హైస్కూల్‌ జూనియర్‌ కాలేజీగా మార్పు... వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత  ఖాళీలపై ఒక అవగాహనకు రావాలని, ఆ తర్వాత భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. టీచర్స్‌ విషయంలో రాజీ పడొద్దని...మౌలిక సదుపాయల కల్పనకోసం ఇంత పెద్ద మొత్తంలో నాడు – నేడు కింద డబ్బు ఖర్చు చేసిన తర్వాత తగిన టీచర్లను ఉంచకపోతే ప్రయోజనం ఉండదన్నారు సీఎం. 

విద్యార్థుల ఇంగ్లిషు భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు టోఫెల్‌ తరహా పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ పైనా దృష్టిపెట్టాలన్నారు.   స్కూలు విద్యార్థుల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పెంచేలా ఒక కోర్సును విడతల వారీగా పెట్టాలన్నారు. దీనిపై కంప్యూటర్‌ నిపుణులతో మాట్లాడి.. ఏ తరగతి నుంచి పెట్టాలో నిర్ణయించాలని అధికారులకు సీఎం సూచించారు. దీనికోసం సరైన పాఠ్యాప్రణాళిక అమలు చేయాలన్నారు. డిజిటల్‌ లెర్నింగ్, డివైజ్‌లపై అవగాహన కల్పించాలన్నారు. లెర్న్‌ టు లెర్న్‌ కాన్పెప్ట్‌కు ఇది నాంది కావాలన్నారు. దీనివల్ల పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించే స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. 

హై ఎండ్‌ డిజిటల్‌ లెర్నింగ్‌లో భాగంగా 8 లేదా 9 తరగతిలో డాంగిల్, ఐపాడ్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. 8వ తరగతి నుంచి లైఫ్‌ స్కిల్స్‌ మరియు కెరీర్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. హైస్కూల్లో లైబ్రరీలు, సైన్స్‌ లేబరేటరీలు, ప్లే గ్రౌండ్స్, ఫిజికల్‌ లిటరసీ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి జగన్.  
 
 

Follow Us:
Download App:
  • android
  • ios