Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా అన్‌ఫిట్.. పోలవరంను నాశనం చేసింది ఆయనే: అసెంబ్లీలో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలవరంపై వాడివేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. పోలవరం నిర్మాణం ఆలస్యం కావడానికి చంద్రబాబు తప్పుడు పనులే కారణమని ఆరోపించారు. 

cm jagan power point presentation on polavaram Project in Ap assembly
Author
First Published Sep 19, 2022, 11:09 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోలవరంపై వాడివేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. పోలవరం నిర్మాణం ఆలస్యం కావడానికి చంద్రబాబు తప్పుడు పనులే కారణమని ఆరోపించారు. పోలవరంపై సీఎం జగన్ శాసనసభలో పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గతంలో రూ. 6.86 లక్షల పరిహారం ఇచ్చారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే దాన్ని రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పామని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారమే జీవో జారీచేశామని వెల్లడించారు. 

గత ప్రభుత్వ హయాంలో 3,073 మందికి పునరావాసం కింద కేవలం రూ. 193 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. గత మూడేళ్లలో 10,330 మందికి పునరావాసం కింద తాము రూ. 1773 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్పారు. పునరావాస పనులు 41.15 మీటర్ల కాంటూరు వరకు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టకు సంబంధించి కేంద్రం నుంచి రూ. 2,900 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. ఆ డబ్బు బ్లాక్ అవ్వడం చంద్రబాబు పుణ్యమేనని విమర్శించారు. 

చంద్రబాబు నాశనం చేసిన ప్రాజెక్టును రిపేర్ చేసేందుకు చాలా కుస్తీలు పడుతున్నామని చెప్పారు. మొదట స్పిల్ వే, అప్రోచ్ పనులు పూర్తిచేయాలని.. ఆ తర్వాత కాపర్ డ్యామ్ కట్టాలని అన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యేందుకు కూడా అన్‌ఫిట్ అంటూ విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను కూడా తమపై వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలు నిజం చేసేందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షకాలంలో పనులు జరగలేదని సీఎం జగన్ చెప్పారు. నవంబర్ నుంచి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్టుగా తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios