శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన జగన్.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీపద్మావతిపురంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీపద్మావతిపురంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడి నుంచే ఎస్‌వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ఫ్లైఓవర్‌తో తిరుపతి వాసులకు, భక్తులకు ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. జీవో ఇచ్చేసిన పరిస్థితి నుంచి ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించామని చెప్పారు. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశామని తెలిపారు. ఇది సంతోషం కలిగించే అంశం అని అన్నారు. మరో రూ. 280 కోట్లు ఖర్చు చేసి.. ఇంకో 3,500 మందికి కూడా పట్టాలు ఇస్తామని తెలిపారు.
ఇక, సీఎం జగన్ ఈరోజు సాయంత్రం తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని తిరుమలకు బయలుదేరి వెళ్లతారు. అక్కడ వకులమాత, రచన గెస్ట్ హౌస్‌లను ప్రారంభించనున్నారు. అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లి సమర్పిస్తారు. పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్ని రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.