అమరావతి:అనంతపురం జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా కొత్తగా మరో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ బుధవారం నాడు శంకుస్థాపన చేశారు.

తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుండి జగన్ వర్చువల్ విధానం ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ పెన్నార్ అప్పర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

గత ప్రభుత్వం జీవో మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. 2018 జనవరి మాసంలో అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. కానీ తమ ప్రభుత్వం ఆనాడు జీవోలో పేర్కొన్న రూ. 800 కోట్లతో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

తోపుదుర్తి, ముట్టాల, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ అప్పర్ ప్రాజెక్టుగా పేరు పెట్టారు.హంద్రీనీవా నుండి ప్రత్యేక కాలువ ద్వారా పేరూర్ డ్యామ్ కు నీటిని తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి  స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రణాళికలకు ప్రభుత్వం అంగీకరించింది.

ఈ రిజర్వాయర్ల ద్వారా రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది.తమ ప్రభుత్వం తీసుకొన్న చర్యలతో అనంతపురం జిల్లా రూపు రేఖలు మారే అవకాశం ఉందని సీఎం ఆకాంక్షను  వ్యక్తం చేశారు.