ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం పారిస్ వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు విమానంలో పారిస్ బయలుదేరి వెళ్లనున్న జగన్ దంపతులు.. రేపు ఉదయం అక్కడికి చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం పారిస్ బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు విమానంలో పారిస్ బయలుదేరి వెళ్తారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5 గంటల సమయంలో వారు పారిస్ చేరుకుంటారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డి పారిస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్‌లోని Insead Business Schoolలో హర్ష రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. జులై 2న జరిగే కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొంటారు.
కాన్వొకేషన్ పూర్తి కాగానే సీఎం జగన్ దంపతులు తిరిగి ఇండియాకు బయలుదేరనున్నారు. జూలై 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు పారిస్ నుంచి బయలుదేరి.. మూడో తేదీ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
ఇక, తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు పారిస్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కొద్దిరోజుల కింద సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతును సడలించాలని కోర్టును కోరారు. ఈ నెల 28 నుంచి వారం రోజుల పాటు పారిస్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.జగన్ పారిస్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని, ఆయన విదేశాలకు వెళ్తే కేసుల విచారణ ఆలస్యం అవుతుందని సీబీఐ కోర్టుకు తెలిపింది.
అనేక కారణాల వల్ల విదేశాలకు వెళుతున్నారని.. అది విచారణపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే సీబీఐ అధికారుల వాదనను తోసిపుచ్చిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో పర్యటనకు వెళ్లొచ్చని ఆదేశాలిచ్చింది. అయితే పారిస్ పర్యటన వివరాలను సీబీఐ అధికారులతో పాటు కోర్టుకు కూడా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
