రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, నాగరత్నం దంపతుల కొడుకు వివాహం జూన్ 7వ తేదీ రాత్రి 1.02 గంటలకు జరగనుంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రికపై సీఎం జగన్ దంపతుల ఫొటోను  అచ్చువేయించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2019లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గుర్తింపు తెచ్చుకున్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన అధికార వైసీపీకి దగ్గరయ్యారు. సమయం వచ్చినప్పుడల్లా సీఎం జగన్‌పై విధేయత చాటుకుంటూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వైసీపీ నేతలను మించి ఆయన సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన జగన్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమారుడి పెళ్లి పత్రికపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌, భారతి దంపతుల ఫోటోను అచ్చు వేయించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాలు.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, నాగరత్నం దంపతుల కొడుకు వివాహం జూన్ 7వ తేదీ రాత్రి 1.02 గంటలకు జరగనుంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రికపై సీఎం జగన్ దంపతుల ఫొటోను అచ్చువేయించారు. ‘‘మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో..’’ అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…


ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన కార్యకర్తలు, అభిమానులు మాత్రం రాపాకపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మించి భజన చేస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్నట్టుగా సమాచారం.