Asianet News TeluguAsianet News Telugu

సత్యసాయి జిల్లాలో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్బ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

CM Jagan Announces Rs 10 Lakhs Ex Gratia each families of those killed in Satya Sai District Auto Accident
Author
First Published Jun 30, 2022, 10:51 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం పారిస్‌ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ‘‘శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు’’ అని ఏపీ సీఎంవో ట్వీట్ చేసింది. 

ఈ ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను తెలుసుకోవాలని రాజ్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాను గవర్నర్ ఆదేశించారు. 

అసలేం ఏం జరిగిందంటే.. 
శ్రీసత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కొందరు చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు బయలుదేరారు. అయితే కూలీలు ప్రయాణిస్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో దానిపై విద్యుత్ వైర్ తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో ఆటో పూర్తిగా కాలి దగ్దం అయింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 

 

కాలిన స్థితిలో ఉన్న మృతదేహాలను ట్రాక్టర్‌లో ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.  ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో కలిపి 12 మంది వరకు ఉంటారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా మహిళలేనని గుర్తించారు. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో.. గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి.. పెద్దకోట్లకు చెందిన కుమారి ఉన్నారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios