ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు... ట్విట్టర్ వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందో. చంద్రుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందనగా... సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సిగ్నల్స్ అక్కడితో నిలిచిపోయాయి. అయితే... ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి మాత్రం చాలా గొప్పదని జగన్, చంద్రబాబు అన్నారు.

విక్రమ్‌ ల్యాండర్‌ దాదాపుగా చంద్రుడి ఉపరితలానికి చేరుకుందని.. మన శాస్త్రవేత్తలను చూసి యావత్‌ భారత్‌ గర్విస్తోందన్నారు. చివరి ఘట్టంలో తలెత్తిన చిన్న ఎదురుదెబ్బ కూడా... భావి విజయాలకు మెట్టుగా మలుచుకొని ముందుకు సాగాలని జగన్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో యావత్‌ దేశం ఇస్రో బృందానికి అండగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల అసాధారణ కృషికి అభినందనలు అని జగన్ ట్వీట్ చేశారు.

‘‘ప్రతిష్టాత్మక #Chandrayan2 ప్రయోగ పర్వంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి, సవాళ్ళను ఎదుర్కొన్న తీరుకు భారతదేశం గర్విస్తోంది. ల్యాండర్ విక్రమ్ విషయంలో ఆఖరి క్షణంలో అవరోధం ఎదురైనా ఇప్పటి వరకు సాధించింది తక్కువేమీ కాదు. టీమ్ ఇస్రో! దేశమంతా మీవెంటే ఉంది. మున్ముందు మనమనుకున్నది సాధిస్తాం.’’ అంటూ  చంద్రబాబు ట్వీట్ చేశారు.