అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పార్టీకి కీలకమైన ఎన్నికల మేని ఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. 

మెుత్తం 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడును ఎంపిక చేశారు. కో కన్వీనర్ గా మంత్రి కాలువ శ్రీనివాసులును నియమించారు. అలాగే  మరో 13 మందిని సభ్యులుగా నియమించారు. 

మేని ఫెస్టో కమిటీ సభ్యులుగా మంత్రి అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్ లను చోటు దక్కించుకున్నారు. వీరితోపాటు ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేష్ కుమార్, భూమా బ్రహ్మానందరెడ్డిలకు అవకాశం కల్పించారు. 

మరోవైపు ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సి.కుటుంబరావు, పంచుమర్తి అనురాధ, విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, పి కృష్ణయ్యలకు అవకాశం కల్పించారు. వీరంతా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ రూపకల్పన చేయనున్నారు.