ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. గాంధీజీ స్ఫూర్తిని గాంధీ జయంతి నాడే తుంగలో తొక్కడం దారుణమన్నారు. అహింసా మార్గాన్ని ప్రపంచానికి చాటిన గాంధీ ఆశయాలకు తూట్లు పొడిచేల వ్యవహకరించారని ధ్వజమెత్తారు. 

అమరావతి: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. గాంధీజీ స్ఫూర్తిని గాంధీ జయంతి నాడే తుంగలో తొక్కడం దారుణమన్నారు. అహింసా మార్గాన్ని ప్రపంచానికి చాటిన గాంధీ ఆశయాలకు తూట్లు పొడిచేల వ్యవహకరించారని ధ్వజమెత్తారు. 

జైజవాన్‌.. జైకిసాన్‌ అని నినదించిన లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి రోజే రైతులపై లాఠీఛార్జ్‌ చేయడం బాధాకరమన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. కేంద్రప్రభుత్వం, యూపీ ప్రభుత్వం, బీజేపీ నేతలు దేశానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

స్వామినాధన్‌ కమిషన్‌ నివేదికను అమలు చెయ్యాలని, రుణమాఫీ ప్రకటించాలని, ఇంధన ధరలు తగ్గించాలంటూ పలు డిమాండ్లతో రైతులు చేపట్టిన కిసాన్ క్రాంతి యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 

రైతులు తమ డిమాండ్ల సాధన కోసం హరిద్వార్‌ నుంచి రాజ్‌ఘాట్‌ వరకూ కిసాన్‌ క్రాంతి యాత్ర చేపట్టారు. అయితే రైతులను ఢిల్లీలోకి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

ఆ బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో తొలగించడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులపై లాఠీ ఝలిపించారు. భాష్పవాయువు ప్రయోగించి రైతులను చెదరగొట్టారు. వాటర్ కేన్లను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనలో రైతులతో సహా ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు.