ఏలూరు: పోలవరం ప్రాజెక్టు గ్యాలరీ వాక్ లో సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ సందడి చేశారు. తండ్రి నారా లోకేష్, తల్లి నారా బ్రహ్మణి, తాతయ్య చంద్రబాబు, నాయనమ్మ భువనేశ్వరిలతో కలిసి గ్యాలరీ వాక్ లో బుడిబుడి అడుగులు వేశారు. తాతయ్యతో ప్రాజెక్టుపై ముచ్చటించారు. చంద్రబాబు సైతం మనవడిని ఎత్తుకుని ప్రాజెక్టును అంతా చూపించారు. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు చూస్తే ఒక అవగాహన వస్తుందని అందుకే తన మనవడు దేవాన్షును తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టును రాష్ట్రంలో ఉండే ప్రతీ పౌరుడు సందర్శించాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ చూసి ప్రాజెక్టును ఎంతలా నిర్మిస్తున్నామో తెలుసుకోవాలని పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను భావితరాలకు తెలియజెయ్యాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు చూస్తే ఒక అవగాహన వస్తుందని తెలిపారు. అందుకే తన మనువడు దేవాన్షును తీసుకువచ్చినట్లు  చెప్పారు. 

ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు కూడా భాగస్వాములైతే, భవిష్యత్తులో వారికొక స్ఫూర్తి, ఆలోచన ఉంటుందన్నారు. పొలవరం ప్రాజెక్టు ఒక చరిత్ర అని, ఈ చరిత్రలో రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.